తెలుగును ఇంతలా ఖూనీ చెయ్యాలా?

Published: Sunday November 03, 2019

రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం జగన్‌ ప్రసంగంలో దొర్లిన తప్పులను ఎత్తి చూపుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్‌ల దాడికి దిగారు. శనివారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హీరోయిన్‌ పేర్లు చదువుతున్నారు ఏంటి? ఓహో నిరక్షరాస్యతకి వచ్చిన పాట్లా? చూడకుండా ప్రసంగం చేసేవాడు తప్పు మాట్లాడితే పప్పు అని సంబరపడ్డారు. మరి చూసి కూడా చదవలేని వాడిని ఏమంటారు విజయసాయిరెడ్డి గారు? ముద్ద పప్పు అనేకదా అంటారు!!’’ అని బుద్దా ట్వీట్‌ చేశారు. ‘‘నిరా రక్షత అంటే నిరక్షరాస్యత, దీవితాన్ని పణంగా అంటే... జీవితాన్ని అనుకుంటా.. సంఘసస్కర్తలు అంటే సంఘ సంస్కర్తలు కాబోలు.. కానీ చివర్లో అన్నారు చూడండీ.. ఆ ‘రాజిక సౌద్దన్నాన్ని’ అని.. అద్గది మాత్రం అర్థం కాలేదు. మీకు అర్థం అయితే చెప్తారా.. వీసారెడ్డి గారు!’’ అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. ఇదే అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ స్పందించారు. ‘ఇన్నాళ్లూ లోకేశ్‌కు తెలుగు మాట్లాడటం రాదని మీ పేటీఎం బ్యాచ్‌తో అపహాస్యం చేయించారు. ఆయనంటే ఎనిమిదేళ్లు విదేశాల్లో ఉండి వచ్చారు. దాని వల్ల ఒకటి రెండు సార్లు తడబడి ఉండొచ్చు. మీకేమైంది? ఇక్కడే ఉంటున్నారుగా! చూసి చదవడం చేతకాదా? తెలుగును ఇంతలా ఖూనీ చెయ్యాలా?’ అని ప్రశ్నించారు.