టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు మరో ముగ్గురు

Published: Wednesday November 06, 2019
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయవేడి రోజురోజుకు పెరుగుతోంది. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం సై అంటే సై అంటున్నాయి. ఇసుక దుమారం రాష్ట్రాన్ని, అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వెళ్లి సీఎం జగన్‌తో భేటీ కావటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ పరిణామం ఇంకా నలుగుతూ ఉండగానే టీడీపీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని జరుగుతున్న ప్రచారం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇటు వంశీ ఎపిసోడ్ ఎండ్‌లెస్ స్టోరీలా సాగుతున్న తరుణంలో అటు గోడమీద పిల్లుల్లా ఉన్న ఆ ముగ్గురు ఎవరన్నదే రెండు పక్షాల్లో చర్చకు దారితీస్తోంది. ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
  "నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుంది" అన్నట్లుగా ఉందట పార్టీ ఫిరాయింపుల విషయంలో అధికార వైసీపీ నేతల వ్యవహారం. తెలుగుదేశం మాదిరిగా తాను పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించబోనని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ్యులుగా ఉండి పార్టీకి రాజీనామా చేయకుండా ఎవరైనా ఫిరాయిస్తే... వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని సీఎం జగన్.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇలా జగన్ చేసిన ప్రకటన... ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీ మారేందుకు ప్రతిబంధకంగా మారింది. ఆయన పార్టీ మారాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు రాసిన వాట్సాప్ లేఖలో వంశీ పేర్కొన్నప్పటికీ, స్పీకర్ కు మాత్రం నేరుగా తన లేఖను పంపలేదు. ఈ నేపథ్యంలో వంశీతో తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మూడు గంటలపాటు భేటీ అయ్యారు. ఈ చర్చలు దాదాపుగా విఫలమయ్యాయి.
 
 
    మరోవైపు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు.. వల్లభనేని వంశీమోహన్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ భేటీ తర్వాత వంశీ ఈనెల 7న వైసీపీలో చేరుతారని ప్రచారం ప్రారంభమైంది. అయితే వంశీ వైసీపీలో చేరాలంటే సీఎం జగన్ ప్రకటన ప్రకారం అంతకుముందే ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది. అయితే వైసీపీ వ్యూహం ఏమిటనేది తెలుగుదేశం పార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. వల్లభనేని వంశీకి టీడీపీ టిక్కెట్ ఇచ్చింది, గెలిపించింది ఆ పార్టీ అధినేత చంద్రబాబు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ గేమ్ ప్లాన్ కు సిద్ధమైందట. ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా లేఖను నేరుగా చంద్రబాబుకే పంపించాలనీ, ఆయనే దాన్ని స్పీకర్ కు పంపేలా చేయాలనీ వైసీపీ వ్యూహంగా ఉన్నట్లు సమాచారం. తద్వారా చంద్రబాబుపైనే ఈ నెపాన్ని నెట్టొచ్చని వైసీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నారు.