ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీని చూస్తే భయమా!

Published: Wednesday November 06, 2019
 ‘నాపై అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నాయకులారా... రాజ్యాంగంపై చర్చి ద్దాం రండి! మీరు మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు రండి. నేను ఒక్కడినే వస్తాను’ అని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం విశాఖలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన భేటీ అయ్యారు. రెండు వేర్వేరు సమావేశాల్లో పాల్గొన్నారు. విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించిన అనంతరం తనపై విమర్శలు గుప్పిస్తున్న మంత్రులు, వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ‘2018లో జనసేనను చూసి వైసీపీ ఎంత భయపడిందో నాకు తెలుసు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు.. అంటే, కౌరవులున్నారు.
 
జనసేనకు ఒకే ఒక్కరు. అంటే ఏకవీర. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీని చూసి అంతమంది ఎమ్మెల్యేలున్న పార్టీ భయపడుతోంది. 22 మంది పార్లమెంటు సభ్యులు ఎక్కడైనా తల ఎగరేయండి కానీ పవన్‌కల్యాణ్‌ ముందు వద్దు. 200 ఏళ్లు అడ్డూ ఆపూ లేకుండా పాలించిన బ్రిటిష్‌ వాళ్లకే దిక్కులేదు. అలాంటిది వైసీపీ ఎంత? ఆ 151 ఎమ్మెల్యేలెంత? మీరెంత... మీ బతుకెంత? నన్ను విమర్శించే వైసీపీ నాయకులకు గూబలు వాచిపోయేలా, చెవుల నుంచి రక్తం వచ్చేలా మాట్లాడగలను. కానీ... ఇలా రెచ్చిపోతే సమస్య పక్కదారి పడుతుంది. అందు కే సహనం వహిస్తాను’ అని తెలిపారు. ఒరే, తురే అన్నా... సోషల్‌ మీడియాలో నీచంగా తిట్టినా సహించాలా... అని ప్రశ్నించారు. ప్రజల పన్నులతో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలకు తమ సొంత పేర్లు ఎలా పెట్టుకుంటారని పవన్‌ ప్రశ్నించారు. కలాం పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టడంపైనా మండిపడ్డారు. కలాం పేరు తొలగిస్తూ జీవో ఇచ్చిన అధికారిని సస్పెండ్‌ చేయాలన్నారు.