ఆ వెబ్‌సైట్లతో నాకు సంబంధం లేదు

Published: Friday November 15, 2019

నెల్లూరు: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. టీడీపీపై వంశీ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవుపలికారు. వెబ్‌సైట్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వంశీ ఆరోపణలను లోకేష్ ఖండించారు. వంశీ చెబుతున్న వెబ్‌సైట్లతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. 2009 నాటి జూ.ఎన్టీఆర్‌ విషయం ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నిన్నటి వరకు జగన్‌ను తిట్టిన వంశీ ఇవాళ అదే పార్టీలోకి వెళ్లారన్నారు. వంశీ ఇవాళ ఒకటి, రేపు మరొకటి మాట్లాడుతారని వ్యాఖ్యానించారు. వంశీ హ్యాంగోవర్ నుంచి బయటకి వచ్చినట్టు లేరని ఎద్దేవా చేశారు. ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం పార్టీ మారిన వారు చేసే.. ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భూ సమస్యల కారణంగా వంశీ పార్టీని వీడారని చెప్పారు.