‘మూడు’ అంశంతో విభజన హామీలు పక్కకు

Published: Thursday January 16, 2020
రాజధాని కోసం అడగ్గానే తమ భూముల రూపంలో లక్ష కోట్ల సంపదను సమకూర్చిన రైతులకు సరైన న్యాయం చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ తనకు ఇష్టమైన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో రాజధాని పెట్టుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హమీల సాధన సమితి ఆధ్వర్యంలో విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మంగళవారం నోటికి నల్ల రిబ్బన్లతో మౌనదీక్ష నిర్వహించారు. à°ˆ సందర్భంగా చలసాని మాట్లాడుతూ.. రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రత్యేక హోదా, విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు వంటి అంశాలను పక్కదారి పట్టించానని సీఎం జగన్‌ ఆనందపడుతన్నారని అన్నారు. మూడు రాజధానులకు మద్దతు తెలిపే ఢిల్లీ పెద్దలు, పక్క రాష్ట్ర పాలకులు వాళ్ల రాష్ర్టాల్లోనూ ఇలాగే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. 1.30 లక్షల చదరపు కిలోమీటర్లున్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటే దాదాపు 33 లక్షల చదరపు కిలోమీటర్లున్న దేశానికి 90 రాజధానులు ఉండాలా అన్నారు.
 
 
తెలంగాణలోనూ ఖమ్మంలో సచివాలయం, మహబూబ్‌నగర్‌లో హైకోర్టు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్యం అధికార వికేంద్రీకరణకు తప్పుడు అర్థం చెబుతుందన్నారు. రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే రాజధానిలో రూ.1.50 లక్షల కోట్ల సంపద ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. రూ.2 లక్షల 27 వేల కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అందులో అమరావతికి రూ.5 వేల కోట్లు కేటాయించడం సరైన నిర్ణయం కాదన్నారు. పోలవరం, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ను కలసినపుడు రూ.70 వేల కోట్ల ఉమ్మడి ఆస్తుల గురించి జగన్‌ చర్చిస్తే బాగుండేదని అన్నారు.