మండలి కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి

Published: Wednesday February 12, 2020

‘‘రాజధాని బిల్లులు శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి వెళ్ళకుండా ఎవరూ ఆపలేరు. చైర్మన్‌ ఆదేశాలను కార్యదర్శి పాటించాల్సిందే. లేదంటే సభా ధిక్కారం పరిధిలోకి వస్తాడు. కార్యదర్శిని అరెస్టు చేయాలని మండలి ఆదేశిస్తే డీజీపీ పాటించాల్సిందే. లేకపోతే డీజీపీని కూడా మండలి ముందుకు పిలిపిస్తాం’’ అని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

 

‘‘శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. మెజారిటీ పక్షం అభీష్టం ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని మేం కోరాం. పంపుతూ చైర్మన్‌ నిర్ణయం తీసుకొన్నారు. అసెంబ్లీలో అయినా, మండలిలో అయినా ఎవరికి మెజారిటీ ఉంటే వారిదే తుది నిర్ణయం. మండలితో ప్రభుత్వం ఘర్షణకు దిగితే వారికే నష్టం’’ అని స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను 14 రోజుల్లో తిప్పి పంపాలన్న నియమం కేవలం మనీ బిల్లులకే వర్తిస్తుందన్నారు. ఇవి మనీ బిల్లులు కావని స్పష్టం చేశారు. సాధారణ బిల్లులకు 4నెలల సమయం ఉంటుందన్నారు. బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తే గవర్నర్‌ సంతకం చేస్తారని తాము అనుకోవడం లేదని, బయట జరుగుతున్న ఆందోళనలు గవర్నర్‌కు తెలుసననీ అన్నారు.

 

‘‘మండలి కార్యదర్శి ఇవాళ కాకపోతే రేపైనా చైౖర్మన్‌ ఆదేశాలను పాటించాల్సిందే. మండలిలో మెజారిటీ ఉన్నవారి అభిప్రాయాన్ని ధిక్కరిస్తే అది సభా హక్కుల ధిక్కారం అవుతుంది. కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి ఉంది. కాబట్టి వారు చెప్పిన ప్రకారం రాసి ఉంటాడు. కార్యదర్శి కూడా సభా ధిక్కారం పరిధిలోకి వస్తాడు. ఆయనను తొలగించే అధికారం మండలి చైర్మన్‌కు, గవర్నర్‌కు ఉంటుంది. సభా ధిక్కారం రెండు రకాలుగా ఉంటుంది. దానిని సభా హక్కుల కమిటీకి పంపవచ్చు. లేదా నేరుగా మండలి తానే చర్చించి చర్య ఏమిటో నిర్ణయం తీసుకోవచ్చు. మండలి తీసుకొన్న నిర్ణయాన్ని పాటించడం తప్ప కార్యదర్శికి మార్గాంతరం లేదు’’ అని యనమల స్పష్టం చేశారు