బెట్టింగ్‌ వ్యవహారం శాసనమండలిని వేడెక్కించింది

Published: Thursday June 18, 2020

బెట్టింగ్‌ వ్యవహారం శాసనమండలిని వేడెక్కించింది. తెలుగుదేశం సభ్యుడు బుద్దా నాగజగదీశ్వరరావు మాట్లాడుతున్న సమయంలో పలు దఫాలు అధికార పక్షం సభ్యులనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, బీసీ నేతను అరెస్టు చేసే తీరు ఇదేనా అంటూ నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. దీనిపై ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలపై ప్రేమ ఉన్నందునే తమ నాయకుడు జగన్‌ ఇద్దరు బీసీ నేతలను రాజ్యసభకు పంపారన్నారు. ఏనాడైనా చంద్రబాబు బీసీ నాయకుడిని రాజ్యసభకు పంపారా అని ప్రశ్నించారు. అంతకుముందు గడ్డాలు పెంచుకున్న మంత్రులు దౌర్జన్యం చేస్తున్నారంటూ నాగ జగదీశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్‌ మండిపడ్డారు. కౌన్సిల్‌ చైర్మన్‌ను ఉద్దేశించి... ‘‘అధ్యక్షా! తమరూ గడ్డం పెంచారు.

 

అంతమాత్రాన రౌడీనా? చంద్రబాబు కూడా గడ్డం పెంచుతున్నారు. ఆయన రౌడీనా?’’ అని వ్యాఖ్యానించారు. కార్మికుల సొమ్ము తిన్న రూ.150 కోట్ల స్కామ్‌లో తప్పు చేసినందునే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని, నేరం చేస్తే బీసీ అని అరెస్టు చేయడం మానేస్తారా అంటూ అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. à°ˆ సమయంలో నాగజగదీశ్వరరావు బెట్టింగ్‌ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై అనిల్‌కుమాల్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘చంద్రబాబు హయాంలో నా ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే బెట్టింగ్‌ ఆరోపణలతో నోటీసులు ఇచ్చారు. నేను పోలీసు స్టేషన్‌కు వెళితే చిన్న కేసుకూడా పెట్టలేకపోయారు’’ అని ఆగ్రహించారు. ఇంతలో నాగ జగదీశ్వరరావు ఏదో మాట్లాడబోగా, ‘‘ నువ్వు కూర్చో’’  అని అనిల్‌ అన్నారు. ‘‘నువ్వే కూర్చో ’’ అంటూ నాగజగదీశ్వరరావు బదులిచ్చారు. à°’à°• మంత్రిని ఉద్దేశించి ‘నువ్వూ..’ అని సంబోధించడాన్ని మండలిలోని మంత్రులు తప్పుబట్టారు. అయితే, అనిల్‌ మాత్రం అదే ఆవేశాన్ని కొనసాగించారు. ‘‘నాకు నోటీసు ఇచ్చిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లాను. ఎప్పుడో 2014లో వాళ్లు నాకు ఎలెక్షన్‌ ఫండ్‌ ఇచ్చారట! బెట్టింగ్‌లో సంబంధం లేదని వాళ్లే అన్నారు’’ అని అనిల్‌ హూంకరించారు.

 

à°ˆ సమయంలో నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ, ‘‘మా నాయకుడు మంచోడు కాబట్టే కేసులు పెట్టలేదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై అనిల్‌ మరింత రెచ్చిపోయారు. ‘‘నన్నేమీ పీకలేరు. చాలెంజ్‌ చేస్తున్నా’’ అంటూ అనిల్‌ తొడగొట్టారు. దీంతో, సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీనియర్‌ మంత్రులూ, ఇతరులూ అనిల్‌ను వారించేలా గట్టిగా అరిచారు. అయినా, అనిల్‌ వెనక్కి తగ్గలేదు. ‘‘నన్ను చంద్రబాబేమీ పీకలేరు. నాకు వ్యతిరేకంగా 100 కోట్ల రూపాయలు కుమ్మరించారు. అయినా, తుక్కుగా ఓడిపోయారు’’ అంటూ ఆగ్రహించారు. మంత్రి వ్యాఖ్యలు, చేష్టతో వాతావరణం వేడెక్కడంతో, చైర్మన్‌ à°Žà°‚à°Ž షరీఫ్‌ సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక, మంత్రి అనిల్‌  హావభావాలపై మహిళా సభ్యులు సంధ్యారాణి, సరస్వతి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘మండలిలో మహిళా ఉద్యోగులున్నారు. మహిళా సభ్యులూ ఉన్నారు. అలాంటి  చోట వాడే భాష బాగాలేదు. వినలేని విధంగా ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రికార్డులు చూసి తగు చర్యలు తీసుకుంటానని షరీఫ్‌ చెప్పారు. టీడీపీ సభ్యుడు ఫరూఖ్‌ మాట్లాడుతూ.. అనిల్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ... అసందర్భ వ్యాఖ్యలన్నింటినీ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.