హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్?

Published: Sunday June 28, 2020

జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 4 రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయం వద్దని సూచించారు. అందరికీ సరైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, దేశవ్యాప్తంగా పెద్ద నగరాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న క్రమంలో.. హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఉండటం సహజమన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ప్రజల కదలిక పెరిగిందని పేర్కొన్నారు. చెన్నైలో వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టారని గుర్తుచేశారు. హైదారాబాద్‌లో కూడా 15 రోజులు లాక్‌డౌన్ విధించడం మంచిదని, వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల్ని సన్నద్ధం చేయాల్సి ఉంటుందని, 4 రోజుల్లో కేబినెట్‌ను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ తెలిపారు.

 

ఇప్పటికే హైదరాబాద్‌లోని బేగం బజార్, సిద్ధి అంబర్ బజార్లలో హోల్ సేల్ వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపారవేళలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్‌ జనరల్ బజార్ పరిసర వ్యాపార ప్రాంతాలన్నిటిలోనూ పూర్తి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని వ్యాపారులే నిర్ణయించారు. కొద్దిపాటి ఉద్యోగులతో కార్యాలయాలను ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు తిరిగి పూర్తిగా మూసివేయడం మొదలుపెట్టాయి. దిల్‌సుఖ్ నగర్‌లోని వెంకటాద్రి షాపింగ్ మార్కెట్ అసోసియేషన్ వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు. సోమవారం నుంచి వచ్చే నెల 5à°µ తేదీ వరకు దుకాణాలు బంద్ చేయనున్నట్లు అసిసోయేషన్ వ్యాపారులు ప్రకటించారు.