మంటగలిసిన మానవత్వం కరోనా బాధితులపై నిర్దయ

Published: Thursday July 16, 2020

కరోనా బాధితుల పట్ల తోటి మనుషులు కనీస మానవత్వం కూడా చూపట్లేదు. కరోనా వచ్చిందని తెలిసినా.. అనుమానం ఉందని చెప్పినా.. వారి పట్ల వివక్ష చూపుతున్నారు. పాజిటివ్‌ బాధితులు, వారి కుటుంబికులు సమాజ వివక్షతో కుంగిపోతున్నారు. అధికారులు మాత్రం కరోనా బాధితుల పట్ల వివక్ష చూపరాదనీ, వారికి మరింత భరోసా కల్పించి ఆత్మవిశ్వాసం పెంపొందించాలని చెబుతూనే ఉన్నారు. ప్రజలు మాత్రం మానట్లేదు. కరోనా బాధితుల పట్ల వివక్ష పేట్రేగిపోతోంది. బాధితుడితోపాటు అతడి ఇంటిలోని ప్రతిఒక్కరి పట్లా వివక్ష చూపుతున్నారు. జిల్లా కేంద్రంలో అద్దె ఇళ్లలో ఉంటున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా పాజిటివ్‌ వస్తే.. బాధితుడి కుటుంబంపై ఇంటి యజమాని తీవ్ర వివక్ష చూపుతున్నారు. కర్కశంగా వ్యవహరిస్తూ వెంటనే ఇల్లు ఖాళీ చేసి, వెళ్లాలని ఒత్తిడి పెడుతున్నారు.

 

ఓవైపు కరోనాతో నలిగిపోతుండగా.. మరోవైపు ఇంటి యజమాని తీరుతో ఆ కుటుంబం నరకం అనుభవిస్తోంది. ఒకవేళ ఇల్లు ఖాళీ చేసి వెళ్దామన్నా.. ఇతర యజమానులు ఇల్లు ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు. చివరికి గట్టిగా దగ్గినా.. తుమ్మినా.. ఇంట్లో వాళ్లు జలుబు, జ్వరం బారిన పడినా కరోనానేమోనని యజమానులు వివక్షగా చూస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయిస్తారేమోనని గట్టిగా దగ్గటం, తుమ్మటానికి కూడా అద్దెవాసులు భయపడిపోతున్నారు. అద్దె ఇంట్లో ఉన్న కుటుంబాలు ఎంత దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నాయో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.

 

జిల్లాలో ఇది వరకెన్నడూ చూడని, వినని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్కరు కొన్ని విషయాలు చెబుతుంటే.. మనం మనుషులమేనా అనే ఆవేదన కలుగుతుంది. కరోనా బారిన పడి ఆస్పత్రులు, ఇళ్ల వద్ద మరణిస్తే వారి దహనసంస్కారాలు చేయాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కరోనా బాధితుడు మరణిస్తే.. చివరకు కుటుంబసభ్యులు కూడా దూరం నుంచే చూడాల్సి వస్తోంది. దహన సంస్కారాలకు ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో కరోనా మృతులను దహనసంస్కారాలకు తరలించేందుకు సినిమా కష్టాలు పడాల్సి వస్తోంది. కుటుంబసభ్యులు, బంధువులు సైతం ముందుకు రావట్లేదు. మృతదేహాలను శ్మశాన వాటికలకు తీసుకెళ్లటానికి అంబులెన్స్‌à°² నిర్వాహకులు పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. దూరంతో సంబంధం లేకుండా రూ.వేలల్లో దండుకుంటున్నారు.

 

శ్మశాన వాటికల్లో మృతదేహాలను పూడ్చటానికి తవ్వే గుంతలకు కూడా వేలల్లో తీసుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో గుంతకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ తీసుకుంటున్నారని అంబులెన్స్‌, ఇతరత్రా ఖర్చులు కలిపి ఒక్కో మృతదేహాన్ని తరలించి, దహన సంస్కారాలు చేయడానికి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకూ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని బాధిత వర్గాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. కొందరైతే లక్ష వరకూ కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు పలువురు ఏర్పాటు చేసిన వైకుంఠ రథాలు కూడా ఇప్పుడు రావట్లేదు. దీంతో వేలకు వేలు వెచ్చించి ప్రత్యేక వాహనాల్లోనే తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి ఆస్పత్రుల్లో సాధారణంగా మరణించినా.. ఇవే కష్టాలు పడాల్సి వస్తోంది.