రోగిని తాకకుండానే వైద్యం....

Published: Sunday July 19, 2020

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సాధారణ, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యతో ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు యాజమాన్యాలు అంగీకరించడం లేదు. అనారోగ్య సమస్య ఏదైనా తప్పనిసరిగా కరోనా టెస్ట్‌ చేయించుకుని రావాల్సిందేనని చెబుతుండడంతో రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ లక్షణాలు లేకపోయినప్పటికీ ఆసుపత్రిలో చేరాలంటే ముందుగా కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు చేతిలో పట్టుకుని రావాల్సిందేనని ఆయా ఆసుపత్రి యాజమాన్యాలు చెప్పేస్తున్నాయి. దీంతో ఒకపక్క అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే.. కరోనా పరీక్ష చేయించుకోవడానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.

 

చిన్నపాటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లిన వాళ్లకు కరోనా పరీక్ష చేయించుకోవడంలో ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. అత్యవసర పరిస్థితిలో వైద్యం చేయించుకోవడానికి చేరుతున్నవారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. కొద్దిరోజుల కిందట విజయనగరం జిల్లా పూసపాటిరేగ ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల వ్యక్తి కిడ్నీ సంబంధ వ్యాధి సమస్యతో నగరంలోని à°“ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. తొలుత అభ్యంతరం చెప్పని సదరు యాజమాన్యం... కొవిడ్‌ పరీక్ష చేయించిన తరువాతే వైద్యం చేస్తామని స్పష్టం చేసింది. అక్కడే నమూనాలు సేకరించి పంపించగా, మూడు రోజుల తరువాత ఫలితాలు వెల్లడయ్యాయి. వైద్యం అందడంలో జాప్యం జరిగింది.

 

నగర పరిధిలోని పలు ప్రైవేట్‌ క్లినిక్‌లు, ఆసుపత్రుల్లో వైద్యులు... రోగులను తాకకుండానే వైద్యం చేస్తున్నారు. దూరం నుంచే రోగి చెప్పిన సమస్యలు విని, మందుల చీటీ రాసిస్తున్నారు. మరికొన్నిచోట్ల జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలతో వస్తున్న రోగులను పరీక్షించకుండానే కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకుని రావాలని చెప్పేస్తున్నారు. దీంతో ఆయా రోగులు ఇబ్బందులుపడుతున్నారు. ఇదిలావుండగా కొంతమంది కొద్దిపాటి జ్వరం వచ్చినా కొవిడ్‌ పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తుండడంతో అక్కడ రద్దీ పెరుగుతున్నది. ఫలితంగా అవసరమైన వారికి పరీక్షలు చేయడంలో జాప్యం జరుగుతున్నది.