పవన్‌కు ఎంపీ రఘురామరాజు సూచన

Published: Monday August 03, 2020

 à°…మరావతి కోసం తొందరపడి ఎవరూ రాజీనామాలు చేయొద్దని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సూచించారు. జనసేన అధినేత పవన్ రాజీనామా వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రాజీనామాలు వృథా ప్రయాస అన్నారు. చేయాల్సింది రాజీనామాలు కాదని, రాజీలేని పోరాటమన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బీటెక్ రవి గురించి మాట్లాడుతూ.. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. కౌన్సిల్‌లో ఉండి పోరాటం చేయాలన్నారు. రాజీనామా చేస్తే తనలాగా రక్షణ లేకుండా పోతుందని, తనకైతే కేంద్రం భద్రత కల్పిస్తుందన్న నమ్మకముందన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఓటింగ్ నిర్వహించాలని సూచించారు. దాన్నిబట్టి మీరు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. కొవ్వొత్తులతో కొంతమంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని.. అయితే అవి సంతాపానికి సూచనగా ఉపయోగిస్తారని తెలియదా అని ఎద్దేవా చేశారు. అయితే మనసులో మాట బయటపెట్టడానికి వాళ్లు ఇలా చేసి ఉంటారన్నారు. మనస్సాక్షిని నమ్మాలని, సాక్షిని కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెఫరెండమ్‌కు వెళ్లరని అర్థమైందన్నారు.

 

అనంతపురం వాళ్లు విశాఖ వెళ్లాలంటే 24 à°—à°‚à°Ÿà°² సమయం పడుతుందని.. విశాఖ దూరమని వ్యాఖ్యానించారు. అమరావతికి వ్యతిరేకమై ప్రజాప్రతినిధులు రాజకీయ భవిష్యత్తును కోల్పోవద్దన్నారు.  సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ.. అవి గెలుపు గుర్రాలు కావన్నారు. ఇప్పుడున్న ఆర్థికపరిస్థితుల్లో చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఒకవేళ డబ్బులతోనే గెలుపు వస్తుందంటే.. ఎన్నికల ముందు చంద్రబాబు 10వేలు ఇస్తే ప్రతిపక్షంగా à°Žà°‚à°¤ కంగారుపడ్డామో తెలియదా అన్నారు. కానీ తర్వాత ఏమైందని అవి టీడీపీకి ఓట్లు తీసుకురాలేదని.. à°† విషయాన్ని అధికారంలో ఉన్న వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.