సముద్రంలోకి 5.7 లక్షల క్యూసెక్కులు విడుదల

Published: Friday August 14, 2020

తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేస్తుండటంతో ధవళేశ్వరం వద్ద గోదావరి కాటన్‌ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయానికి 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి విడిచిపెట్టగా సాయంత్రానికి 5,78,724 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. ప్రవాహం పెరుగుతుండడంతో గోదావరిలో లాంచీలు, బోట్లు, ఇసుకతీత నావల ప్రయాణంపై నిషేధం విధించారు.  

జల దిగ్బంధంలో దేవీపట్నం మండలం

గోదావరి ఉప నదులు పొంగి ప్రవహించడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన దేవీపట్నం మండలం కొండమొదలు, నడిపూడి, దేవీపట్నం, కొయ్యేరు తదితర గ్రామాల చుట్టూ వరదనీరు చేరుతోంది. సుమారు 33 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మండల కేంద్రానికి, మైదాన ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో నీటిమట్టం పెరగడం, శబరి కూడా పోటెత్తడంతో  పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద నీరు చేరింది. ఎద్దువాగు పొంగి పొర్లడం, గోదావరి వరదతో వేలేరుపాడు మండలంలో 16 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పోలవరం సమీపాన కొత్తూరు కాజ్‌వేపై నా వరద నీరు చేరడంతో పోలవరానికి ఎగువ గ్రామాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఒకవైపు కాఫర్‌ డ్యామ్‌, మరోవైపు మట్టికట్ట కట్టడం వలన తమ మండలాలు ముంపునకు గురవుతున్నాయని కుక్కునూరు, వేలేరుపాడు వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే స్పిల్‌చానల్‌ మార్గం నిండా పూర్తిగా వరద నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ శివారు క్రీస్తునగరానికి చెందిన  నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యారు.

కృష్ణమ్మకు జల à°•à°³ 

కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 20,173 క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తం 12 గేట్లను అడుగు మేర ఎత్తి 8,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉపరితల ద్రోణి, ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.