న్యాయవ్యవస్థకు నిష్పాక్షికత ఆత్మ అయితే స్వతంత్రత దాని జీవనాడి.

Published: Sunday August 16, 2020

‘‘న్యాయవ్యవస్థకు నిష్పాక్షికత ఆత్మ అయితే స్వతంత్రత దాని జీవనాడి. స్వతంత్రత లేకుండా నిష్పాక్షికతకు తావేలేదు’’ అని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ఉద్బోధించారు. జోక్యం, ఒత్తిళ్లకు దూరంగా స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నప్పుడే న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులు నిబద్ధతతో పని చేస్తారన్నారు. à°ˆ వ్యవస్థకున్న స్వతంత్రత దాని ప్రాథమిక నిర్మాణంలో à°’à°• భాగమన్న ఆయన, బాహ్యశక్తుల అనవసర జోక్యంతో అది నీరుగారేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. శనివారం హైకోర్టులో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు హాజరైన చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి.. పోలీసు గౌరవవందనాన్ని స్వీకరించి, జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు. ‘‘ఇది కొవిడ్‌-19 నేపథ్యంలో భద్రతాపరమైన పరిమితుల మధ్య జరుపుకొంటున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవం. యావత్ప్రపంచం కరోనా వైర్‌సతో పోరాడుతోంది.

 

కరోనా బారిన పడి కోలుకున్న అధికారులు, సిబ్బందికి నా అభినందనలు. ఇందుకు కేవలం శారీరక బలమే చాలదు.మానసిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యం. న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులతో పాటు ఉద్యోగులు కూడా విలువైన ఆస్తులు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తీ స్వీయ సంరక్షణ, క్రమశిక్షణతో ఆరోగ్యంగా ఉండాలి. కరోనా కొత్త జీవనశైలిని నేర్పింది. అనూహ్యమైన పరిస్థితుల్లో, కొత్త వాతావరణంలో జీవిస్తూ పని చేయడం నేర్చుకున్నాం. à°ˆ క్లిష్ట పరిస్థితుల్లోనూ హైకోర్టు స్ఫూర్తివంతంగా సేవలందిస్తోంది’’ అంటూ జడ్జీలను, సిబ్బందిని అభినందించారు. 

 

‘‘ప్రజల్లో ఉన్న విశ్వాసమే న్యాయవ్యవస్థకు గొప్ప బలం. à°† విశ్వాసాన్ని కొనసాగించేందుకు రాజ్యాంగస్ఫూర్తితో గట్టి కృషి చేయాలి. భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ న్యాయం పొందే హక్కును  ప్రసాదించినా, కొంతమందికే అది దక్కుతోంది’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి పేర్కొన్నారు. న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వసనీయత ఉండటం అవసరమని, కానీ మూడు విషయాలు à°† నమ్మకాన్ని వమ్ము చేస్తాయంటూ జస్టిస్‌ బర్గర్‌ వ్యాఖ్యల సారాన్ని ఆయన ఉటంకించారు. ‘‘అపనమ్మకం, అసమర్థత, జాప్యం అనే మూడు అంశాలు తీర్పు విలువను తగ్గిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు’’ అని తెలిపారు. ‘దేశ పురోగతి, అభివృద్ధిలో పాలుపంచుకోవడం ప్రతి వ్యక్తి యొక్క విధి’ అన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ... హక్కులు, బాధ్యతలు రెండూ కలిసి ఉంటాయన్నారు. ‘బాధ్యతతో కూడిన పని మన హక్కులను సురక్షితంగా ఉంచుతుంద’న్న మహాత్మాగాంధీ ఉద్బోధనను గుర్తు చేస్తూ... బాధ్యత లేని హక్కులు అరాచకానికి దారి తీస్తాయని తెలిపారు.