లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తా

Published: Sunday September 13, 2020

ఏపీలో ఎంపీ రఘరామకృష్ణరాజు, వైసీపీ నేతల మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. స్వపక్షంలోనే విపక్షంగా రాఘురామ మారారు. ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా రాఘురామకృష్ణరాజుకు కౌంటరిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో రఘురామ వర్సెస్ వైసీపీగా మారింది. అయితే అమరావతి అంశం వీరి మధ్య మరింత ఆజ్యం పోస్తోంది. వైసీపీ, రఘురామకృష్ణరాజు సవాల్ ప్రతి సవాల్‌తో ఏపీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అమరావతిపై రిఫరెండంగా ఎన్నిక జరిగితే.. కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని తెలిపారు. తమ మధ్య విభేదాలకు కారణం మీకు తెలియదన్నారు. రాజీనామాపై మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు ప్రకటనలు చేయడం సరికాదని రఘురామకృష్ణరాజు తోచిపుచ్చారు. 

 

 

రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని, ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధం?.. అదేమైనా రిఫరెండమా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించిన విషయం తెలిసందే. రాజధాని భూముల విషయంలో తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని, అమరావతిలో నిర్మాణాల కోసం త్వరలో నిధుల సమీకరిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

 

అంతకుముందు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్‌కు రఘురామకృష్ణరాజు ప్రతి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ‘‘నేను నా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గితే... అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని మీ సీఎం రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధమేనా? నా చాలెంజ్‌ను స్వీకరిస్తే రాజీనామా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. ఉప ఎన్నికను అమరావతిపై రిఫరెండంగా స్వీకరించేందుకు మీ సీఎం సిద్ధమేనా?’’ అని రఘురామకృష్ణంరాజు ప్రతి సవాల్‌ విసిరారు.