జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన

Published: Friday October 02, 2020

హత్రాస్ సామూహిక అత్యాచార ఘటనపై రోజుకు ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ సామాజిక ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. తొలుత ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగాలని భావించారు. అయితే, రాజ్‌పుత్ ప్రాంతంలో ఆంక్షల కారణంగా తర్వాత ఆందోళనను జంతర్‌మంతర్‌కు మార్చారు. 

 

ఉత్తరప్రదేశ్‌లో గూండారాజ్యం ఉందని, బాధిత కుటుంబం నివసిస్తున్న గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారని సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించినట్టు ‘పీటీఐ’ పేర్కొంది. మీడియా ప్రతినిధులను, ప్రతిపక్ష పార్టీల నేతలను గ్రామంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను కూడా లాగేసుకున్నారని ఆరోపించారు. 

 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరును శివసేన నేత సంజయ్ రౌత్ తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారమేనని విమర్శించారు. రాహుల్ ఓ ప్రముఖ పార్టీ నేత అని, ఆయనపై పోలీసులు చేయిచేసుకోవడాన్ని ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. ఆయనను హత్రాస్ వెళ్లకుండా 144 సెక్షన్ విధించవచ్చని, కానీ పోలీసులు రాహుల్ కాలర్ పట్టుకుని తోసివేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.