1.53 లక్షల కుటుంబాలకు ఆర్‌ఓఎ్‌ఫఆర్‌ పట్టాలు

Published: Saturday October 03, 2020

అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతామని, వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో అటవీ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.

 

à°ˆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పట్టాల పంపిణీతో పాటు భూమి పొందిన ప్రతి ఒక్కరికీ వ్యవసాయం కోసం రైతు భరోసా సొమ్ము రూ.13,500 à°ˆ నెలలోనే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భూ వివాదాలకు తావులేకుండా డిజిటల్‌ సర్వే ద్వారా గట్టు, హద్దులు ఏర్పాటుచేసి మహిళల పేరుతో హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. అక్టోబరును హక్కు పత్రాల పంపిణీ నెలగా ప్రకటించామన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను నాడు-నేడులో అభివృద్ధి చేసి ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు.

 

పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల, కురుపాంలో రూ.153 కోట్లతో ఇంజనీరింగ్‌ కళాశాల, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలల్లో రూ.300కోట్లతో చేపట్టే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో మూడో వంతు పట్టాలను పాడేరులోనే పంపిణీ చేస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అన్నారు.

 

ఐటీడీఏ పరిధిలో 48,053 కుటుంబాలకు 86,473 ఎకరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. విజయనగరం జిల్లాలో 23,021మంది గిరిజనులకు 40,015 ఎకరాలకు సంబంధించి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 17,939మంది గిరిజనులకు 26,931 ఎకరాలు సాగు హక్కు పత్రాలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పంపిణీ చేశారు.