భారీ వర్షాలతో పత్తి రైతులకు కన్నీరే

Published: Thursday October 15, 2020

భారీ వర్షాలతో పత్తి రైతులకు కన్నీరే మిగిలింది. తొలి పత్తి తీసే ప్రస్తుత తరుణంలో తీవ్ర వాయుగుండం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. వాయుగుండంతో కురిసిన భారీ వర్షాలకు పత్తి పూత రాలిపోయి, కాయ కుళ్లిపోయే పరిస్థితి తలెత్తింది. ఎకరాకు సుమారు రెండు క్వింటాళ్ల పత్తి చేలల్లో పాడైపోయిందని రైతులు వాపోతున్నారు.

కర్నూలు, కడప, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల హెక్టార్లలో తీయడానికి సిద్ధంగా ఉన్న దాదాపు 20 లక్షల క్వింటాళ్ల పత్తి వానకు పాడైనట్లు సమాచారం. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటా రూ.5వేలు చొప్పున దాదాపు రూ.వెయ్యికోట్ల విలువైన పత్తి పొలాల్లోనే మట్టిపాలైపోయిందని తెలుస్తోంది. ఇది చూసి రైతులు వాపోతుంటే, కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. కౌలు కట్టి, పెట్టుబడి పెట్టి, చేతికొచ్చే పంట పాడై కన్నీరు పెడుతున్నారు.