సరూర్‌నగర్‌ చెరువు లోతట్టు ప్రాంతాల్లో నష్టం అంచనా రూ.150 కోట్లు

Published: Tuesday October 20, 2020

 à°µà°¾à°°à°‚ రోజులుగా à°•à°‚à°Ÿà°¿ మీద కునుకు లేకుండా చేస్తున్న వరదలు దిల్‌సుఖ్‌నగర్‌ వాసులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. సరూర్‌నగర్‌ చెరువు లోతట్టు ప్రాంతంలో ఉన్న కాలనీలు ముంపు బారిన పడడంతో కాలనీలన్నీ జలమయం అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో à°ˆ ముంపు జాతీయరహదారిని చైతన్యపురి సెంట్రో నుంచి మొదలుకొని దిల్‌సుఖ్‌నగర్‌ సాయిసంస్థాన్‌ ఆర్చ్‌ వరకు ప్రధాన రహదారి జలదిగ్బంధం అయింది. రాకపోకలు ఆగిపోయాయి. వ్యాపారాలు స్తంభించాయి. 

 

ప్రతి రోజు వేలాది సంఖ్యలో రాకపోకలు సాగించే దిల్‌సుఖ్‌నగర్‌ జాతీయ రహదారి నడుములోతు నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చైతన్యపురి చౌరస్తా నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ జయబజార్‌ వరకు జాతీయరహదారికి ఇరువైపులా వరద నీటి ఉధృతి ఉప్పెనలా కొనసాగుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాలు నీళ్లల్లో మునిగాయి. ఇళ్లలో, వాణిజ్య సముదాయాల్లో వాహనాల ధ్వంసం రూ. కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

చెరువు లోతట్టున ఉన్న శారదనగర్‌, కోదండరామ్‌నగర్‌, సీసలబస్తీ, పీ అండ్‌ à°Ÿà±€ కాలనీ, వీవీనగర్‌, కమలానగర్‌, న్యూ గడ్డిఅన్నారం, పటేల్‌ నగర్‌ కాలనీలను వరద నీరు ముంచెత్తింది. కాలువ నిర్మాణంలో జరిగిన కొన్ని తప్పిదాలు, ఎగువ చెరువుల నుంచి పెద్ద ఎత్తున సరూర్‌నగర్‌ చెరువులోకి నీటి ఉధృతి రావడం... వచ్చిన వరదనీరు పోయేందుకు దిగువ ప్రాంతాల్లో సరైన మార్గాలు లేకపోవడంతో గడ్డిఅన్నారం డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. దీంతో à°ˆ ముంపు కాలనీలలోని సుమారు 3వేల నివాసిత గృహాలలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లు నీట మునిగిపోయినట్లు తెలుస్తోంది. వీటిల్లో కొన్ని బహుళఅంతస్థుల భవనాలు, అపార్ట్‌మెంట్‌లు కూడా ఉన్నాయి. వరదనీరు ఐదారు ఫీట్ల మేర ఇళ్లలోకి చేరడంతో ఇళ్లలో ఉన్న వారు బతుకుజీవుడా.. అంటూ పై అంతస్తుల్లోకి వెళ్లారు. లేదా సురక్షిత ప్రాంతాలకు పరుగుతీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇళ్లల్లో ఉన్న నిత్యావసరాలు సహా ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, ఫర్నిచర్‌ తదితర విలువైన గృహోపకరణాలు నీట మునిగాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్‌లు, డైనింగ్‌ టేబుళ్లు, మంచాలు, సోఫాలు తదితర గృహోపకరణాలతో పాటు విద్యుత్‌మోటార్ల లాంటి విలువైన వస్తువులు పాడయ్యాయి. దీంతో పాటు అపార్ట్‌మెంట్‌లు, పెద్దపెద్ద భవంతుల సెల్లార్‌లలో ఉన్న విద్యుత్‌మోటార్లు, జనరేటర్లు, లిఫ్ట్‌లు పూర్తిగా పాడయ్యాయి. లోతట్టు కాలనీలోలోని వరద తాకిడి బారిన పడిన సుమారు 3వేల గృహాలలో పాడైన వస్తువుల నష్టం విలువ సుమారు రూ. కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. పాడైన వస్తువుల విలువ ఇండిపెండెంట్‌ ఇళ్లలో రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు, అపార్ట్‌మెంట్‌లు, పెద్ద భవనాలలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు.