లోకేష్‌కు తప్పిన ప్రమాదం

Published: Monday October 26, 2020

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. అయితే à°† ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపుచేశారు. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరిపీల్చుకున్నారు.

 

 

ఈ ఘటనకు ముందు.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను లోకేష్ పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో మాటామంతి జరిపి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ తోడు దొంగలు తనను తిరగకుండా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వారు తిరిగితే తాము ఎందుకు వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతామని ప్రశ్నించారు. కొల్లేరుకు ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయని... వారిని ఆదుకునే చర్యలు లేవని విమర్శించారు. తాము వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతున్నామని ఆగమేఘాల మీద ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని అవి కూడా అరకొరగానే ఉన్నాయని లోకేష్ దుయ్యబట్టారు.