దుబ్బాక గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

Published: Tuesday November 10, 2020

దుబ్బాక గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇక తమ తదుపరి టార్గెట్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలేనంటున్నారు కమలనాథులు. తెలంగాణలో కమలానికి ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచుకుంటూ గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తామంటున్నారు. హైదరాబాద్‌లో గట్టి పట్టున్నా గతంలో ఎన్నడూ అంతగా శ్రద్ధ పెట్టని నేతలు నేడు పార్టీ బలం పెంచే యత్నాల్లో పడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ నేతలు ఆరాటపడుతున్నారు. తద్వారా మళ్లీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీకి పూర్తి అనుకూల వాతావరణం తయారు చేసుకోవాలని యోచిస్తున్నారు. ఐక్యత విషయంలోనూ ఆదర్శం పాటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా దుబ్బాకలో బీజేపీ నాయకత్వం అంతా సమష్టిగా పోరాడింది. దీంతో దుబ్బాకలో విజయం సాధ్యమైంది. ఇదే ఫలితాన్ని గ్రేటర్ ఎన్నికల్లోనూ రాబట్టుకోవాలని కమలనాథులు పథకాలు రచిస్తున్నారు. 

ఇప్పటికే గ్రేటర్ పరిధిలోకి వచ్చే అనేక నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. శేరిలింగంపల్లిలో అయితే బీజేపీ నేత గజ్జల యోగానంద్ ఏకంగా పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాలపై హామీలిస్తూ స్థానికంగా సందడి చేస్తున్నారు. అటు పాతబస్తీలోనూ పాగా వేయడానికి బీజేపీ నేతలు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. తమకు ఛాన్సిస్తే పాతబస్తీని హైటెక్ సిటీగా మారుస్తామని ఓటర్లను ఆకర్షించేయత్నం చేశారు తెలంగాణ బీజేపీ ఛీఫ్ బండి సంజయ్. మొత్తానికి దుబ్బాక గెలుపు గ్రేటర్ ఎన్నికలకు బీజేపీకి మరో మలుపు అవుతుందని కమలనాథులు విశ్వాసంగా ఉన్నారు.