రాయి తవ్వకాలకు ససేమిరా

Published: Saturday November 14, 2020

విశాఖ జిల్లాలో గిరిజనులు à°“ వైసీపీ నేతకు గట్టి ఝలక్‌ ఇచ్చారు. తమ ప్రాంతంలో నల్లరాయి తవ్వకాలకు అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం గ్రామ సభ నిర్వహణకు వస్తున్న అధికారులను దారిలోనే అడ్డుకుని à°ˆ విషయం స్పష్టం చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ చీమలబయలులో గ్రామ సర్వే నంబరు ఒకటిలో నల్లరాయి క్వారీ తవ్వకాలకు అనుమతి కోరుతూ జల్లి సుధాకర్‌ (చింతపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భర్త) అనకాపల్లి గనుల శాఖ అధికారులకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై శుక్రవారం గ్రామసభ నిర్వహించాలని అధికారులు భావించారు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా నాయకుడు బోనంగి చిన్నయ్యపడాల్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయి, పెసా కార్యదర్శి గంగన్న పడాల్‌ నాయకత్వంలో పలువురు గిరిజనులు ఆందోళనకు సమాయత్తమయ్యారు. గ్రామంలోకి రాకముందే తహశీల్దార్‌ గోపాలకృష్ణ, ఆర్‌ఐ రాజన్నదొర, ఇతర రెవెన్యూ ఉద్యోగులను అడ్డుకున్నారు. దీంతో తహశీల్దార్‌ రోడ్డుపైనే కూర్చుని వారితో చర్చలు జరిపారు.

 

నల్లరాయి తవ్వకాలకు సుధాకర్‌ దరఖాస్తు చేసుకున్నట్టు అనకాపల్లి మైనింగ్‌ అధికారుల నుంచి నోటీసు వచ్చిందని, గ్రామసభలో స్థానికుల అభిప్రాయాలు తెలుసుకుని à°† మేరకు మైనింగ్‌ అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. గిరిజనులంతా ఒక్కసారిగా స్పందిస్తూ.. నల్లరాయి తవ్వకాలకు అనుమతించేది లేదన్నారు. à°† మేరకు సంతకాలు చేయాలని తహశీల్దార్‌ కోరగా.. వారు అంగీకరించలేదు. దీంతో గ్రామసభ జరగలేదని, స్థానిక గిరిజనులంతా నల్లరాయి క్వారీని వ్యతిరేకిస్తున్నారని మైనింగ్‌ అధికారులకు నివేదిక పంపిస్తామంటూ ఆయన సిబ్బందితో వెనుదిరిగారు. à°ˆ సందర్భంగా చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, ఏజెన్సీలో మైనింగ్‌ను గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, అయినప్పటికీ గిరిజనుడైన వైసీపీ నేత సుధాకర్‌.. నల్లరాయి తవ్వకాలకు దరఖాస్తు చేయడం విచారకరమన్నారు. ఏజెన్సీలో మైనింగ్‌ను అడ్డుకునేందుకు ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు దుర్యా ధర్మ, రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.