పెట్రోలు అక్కర్లేని కార్లు

Published: Thursday December 10, 2020

పెట్రోలు అవసరం లేకుండా కార్లను నడిపే రోజులు రాబోతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రవాణా మంత్రిత్వ శాఖ ఫ్లెక్సీ ఇంజిన్ ఆప్షన్ ప్లాన్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు తమ కార్లకు ఇంధనంగా పెట్రోలును కానీ, ఇథనాల్‌ను కానీ వాడుకోవడానికి దీనివల్ల అవకాశం కలుగుతుందన్నారు. ఇథనాల్ తయారీకి చెరకు బాగా ఉపయోగపడుతుందని, ఇథనాల్ వినియోగాన్ని పెంచాలని చెప్పారు. 

 

‘ఆత్మనిర్బర్ భారత్’లో భాగంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంపూర్ణ సహకారం అందిస్తామని నితిన్ గడ్కరీ సెప్టెంబరులో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మన దేశంలో పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టాలని కోరారు. గ్రీన్ ఫ్యూయల్‌ను అమ్మేందుకు వీలుగా సొంతంగా ఫ్యూయల్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చునని ఆటోమేకర్లకు చెప్పారు. కార్ మేకర్లు బీఎస్-4 నుంచి బీఎస్-6కు మారితే, బ్రెజిల్, అమెరికా, కెనడా తరహాలో ఫ్లెక్స్ ఇంజిన్లను ప్రవేశపెట్టవచ్చునని తెలిపారు.