విశాఖలో కృష్ణా బోర్డు

Published: Monday January 04, 2021

 à°°à°¾à°·à±à°Ÿà±à°° విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాల్సిన కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. à°ˆ మేరకు à°—à°¤ నెల 25à°¨ నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. విశాఖలో తగు కార్యాలయాన్ని చూడాలని ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫను ఆదేశించామని.. ఆయన కార్యాలయాన్ని చూశాక సమాచారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక.. దాస్‌ కేఆర్‌ఎంబీకి మరో లేఖ రాశారు. వాస్తవానికి గతంలో విజయవాడలో బోర్డు కార్యాలయాన్ని నెలకొల్పాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖలు రాయగా.. కేంద్రమూ అంగీకరించింది. బోర్డు అధికారులు విజయవాడ వచ్చి జల వనరుల శాఖకు చెందిన పలు కార్యాలయాలను పరిశీలించారు. హెడ్‌క్వార్టర్స్‌ కోసం à°’à°• కార్యాలయాన్ని కూడా ఎంపిక చేశారు. దానిలోకి మారతామని కేఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశాల్లోనూ వెల్లడించారు. అయితే.. తెలంగాణ సర్కారు హైదరాబాద్‌లోనే కొనసాగాలని పట్టుబడుతూ వచ్చింది. బోర్డు ఇటీవలే విజయవాడకు తరలిపోతున్నామని తెలిపింది.

 

à°ˆ సమయంలో విశాఖకు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది. విజయవాడలో ఆదివారం సాగు నీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. 2014 విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరంలో కేఆర్‌ఎంబీని.. హైదరాబాద్‌లో జీఆర్‌ఎంబీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారని.. కానీ ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలించాలంటూ బోర్డు చైర్మన్‌కు లేఖ రాయడం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని.. à°ˆ నిర్ణయాన్ని నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖను కోరతామని చెప్పారు. ఇంకోవైపు.. కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతుంటే.. విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడమేమిటని సామాజిక ఉద్యమకారుడు à°Ÿà°¿.లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలని à°“ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

 

కృష్ణా బోర్డు కార్యాలయాన్ని కృష్ణా నదీపరివాహక ప్రాంతాలైన అమరావతిలో గానీ.. కర్నూలులో గానీ పెట్టాలన్న డిమాండ్‌ మొదటి నుంచీ ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం దానిని కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలను దాటి.. ఎగువన విశాఖలో నాగావళి పరివాహక ప్రాంతం సమీపాన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరంగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మూడు రాజధానుల అంశం హైకోర్టు ముందు ఉన్నప్పటికీ.. రాజధాని కచ్చితంగా విశాఖకు వెళ్తుందన్న సంకేతం ఇవ్వడమే ప్రభుత్వ నిర్ణయంలోని ఆంతర్యమని పేర్కొంటున్నాయి. బోర్డు ఇప్పటికే విజయవాడను ఖరారు చేసిన తర్వాత ఇప్పుడు విశాఖలో పెట్టాలనడంపై కృష్ణా బోర్డుతోపాటు కేంద్రం ఎలా స్పందిస్తాయోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. కేఆర్‌ఎంబీని విశాఖకు తరలించేందుకు కేంద్రం సమ్మతిస్తే.. అక్కడి బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో మూడు రాజధానులకు మద్దతిస్తోందన్నది బహిర్గతమవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయు.