విశాఖలో ఎలక్ట్రిక్ వాహనాలు
Published: Friday November 03, 2017

విశాఖపట్నంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) స్కూలు రానుంది. అక్కడి టెక్‌మహీంద్రా కంపెనీలో మరిన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. అమరావతి, విశాఖపట్నం, తిరుపతిల్లో త్వరలోనే ఎలక్ర్టానిక్ వాహనాలు కనిపించనున్నాయి. తొలిగా విశాఖపట్నంలో 500 ఎలక్ర్టిక్ కార్లు, 100 ఆటోలతో పైలట్ ప్రాజెక్టు చేసేందుకు ఓలా ముందుకొచ్చింది. వీటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పానసోనిక్ అంగీకరించింది. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ గురువారం బెంగళూరులో పలు ఐటీ, ఎలక్ర్టానిక్ కంపెనీల ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఆయన తొలుత టెక్‌మహీంద్రా సీవోవో ఎల్.రవిచంద్రన్‌తో చర్చలు జరిపారు. 2019లోపు రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దాన్ని చేరుకోవడానికి సహకరించాలని, విశాఖ టెక్‌మహీంద్రా సెంటర్‌లో మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నూతన టెక్నాలజీతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐఐడీటీ)లో టెక్‌మహీంద్ర భాగస్వామి కావాలని కోరారు. వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తున్న ఆ సంస్థ.. ఏపీతోనూ కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. దీనిపై రవిచంద్రన్ స్పందిస్తూ... విశాఖ సెంటర్‌లో కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని, తద్వారా మరిన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నామని చెప్పారు. ఆ నగరంలో త్వరలోనే ఐవోటీ స్కూల్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.
విశాఖలో జరిగే అగ్రిటెక్ సదస్సులో భాగస్వాములం అవుతామని హామీ ఇచ్చారు. పానసోనిక్ ఇండియా హెడ్(ఎనర్జీ సిస్టమ్స్ డివిజన్) అతుల్ ఆర్యను కూడా లోకేశ్ కలిశారు. కాగా, ఏపీలో కంపెనీ ఏర్పాటు విషయంపై జపాన్‌లోని తమ కేంద్ర కార్యాలయంతో చర్చిస్తామని, జపాన్ రావాలని లోకేశ్‌ను పానసోనిక్ ప్రతినిధులు ఆహ్వానించారు. అనంతరం జూనిపర్ నెట్‌వర్క్స్ ఇండియా ఎండీ దినేష్ వర్మతో మంత్రి చర్చలు జరిపారు. విశాఖను ఐటీ హబ్‌గా, రాయలసీమను తయారీ రంగానికి హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలకు త్వరితగతిన భూములు, అనుమతులు ఇస్తున్నామని గుర్తుచేశారు. విశాఖలో జూనిపర్ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సదరు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికతో రాష్ట్రానికి వస్తామన్నారు.
మరోవైపు ఆధార్ అనుసంధానంతో ఈ-సైన్, డిజిటల్ సిగ్నేచర్ సేవలు అందిస్తున్న ఈ ముద్రా కంపెనీ చైర్మన్ వి.శ్రీనివాసన్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తామని, త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికతో వస్తామని శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. టెర్మినస్ సర్క్యూట్ సీఈవో శంకర్‌రెడ్డితోనూ మంత్రి మాట్లాడారు. హైస్పీడ్ సీరియల్ లింక్ ఉత్పత్తులు, సెమికనెక్టర్స్, సర్క్యూట్స్‌లను ఈ కంపెనీ తయారుచేస్తుంది. ఏపీలో చిప్ డిజైనింగ్ తయారీ కంపెనీ ఏర్పాటుచేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని లోకేశ్ చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Share this on your social network: