స్థానిక ఎన్నికల వాయిదాకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నా

Published: Sunday January 10, 2021

స్థానిక ఎన్నికల వాయిదాకు ఏపీ ప్రభుత్వం చేయని  ప్రయత్నాలు లేవు. మొన్నటి వరకు కరోనా సాకు చెప్పిన జగన్ సర్కార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ అడ్డొస్తోందంటోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులే కాదు సీఎస్ మొదలుకొని ఉద్యోగ సంఘాల నేతల వరకు ఒక్కటే మాట. స్థానిక ఎన్నికలు వద్దంటే వద్దని. 

 

పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇలా నోటిఫికేషన్ విడుదల చేశారో లేదో  రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించబోమని సీఎస్ ఆధిత్యానాథ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే హైకోర్టు మెట్లెక్కిన  జగన్ సర్కార్ ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్‌పై ముందు హైకోర్టు, కుదరకపోతే ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీ సర్కార్ వాదన ఎంత వరకు నెగ్గుతోంది. 

 

గత నెలలో కేరళలో స్థానిక ఎన్నికల వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కోవిడ్-19 బాధితులు, 65 ఏళ్లకు పైబడిన  పౌరులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర 27/ఏ నిబంధనను సవరిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేసిన సదరు ఎమ్మెల్యే దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడంలేదన్నారు. అయితే వాదనలు ఆలకించడానికి ధర్మాసనం ఆసక్తి చూపలేదు.