గణనీయంగా పెరిగిన శ్రీవారి ఆదాయం

Published: Monday January 11, 2021

కోవిడ్ తర్వాత వ్యవస్థలన్నీ గాడిన పడుతున్నాయి. ఆలయాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కోవిడ్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల సంఖ్య పెరగకపోయినా స్వామివారి హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 

 

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి సన్నిధిలో ఎన్నో మార్పులకు కరోనా వైరస్ కారణమైంది. శ్రీవారి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు దర్శనాలు నిలిపివేసి స్వామి వారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహించారు. à°† తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించారు. దీంతో టీటీడీ ఆదాయంపై ప్రభావం పడింది. ఏడాది ఆదాయం రూ. 1350కోట్లు వస్తుందని టీటీడీ అంచనా వేసినా అది రూ. 500 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ఇక టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా రూ.3,309 కోట్లతో అంచనా వేసినా 2000 కోట్ల రూపాయలకు పరిమితయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా టీటీడీ ఆదాయం తగ్గుముఖంపట్టడంతో పాటు శ్రీవారి దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 

 

కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో శ్రీవారి ఆలయంలో దర్శనాలు కూడా ప్రారంభించింది టీటీడీ. జూన్ 8 నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించారు. మొదట్లో రోజుకు 6 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పించారు. హుండీ ఆదాయం 30 నుంచి 50 లక్షల వరకు వచ్చేది. à°† తర్వాత శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను క్రమంగా పెంచింది. ప్రస్తుతం నిత్యం 40 వేల మంది వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది. దీంతో హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. 2019 డిసెంబర్ నెలలో శ్రీవారిని 21 లక్షల 50 వేల మంది భక్తులు దర్శించుకోగా.. 2020 డిసెంబర్‌లో 11 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శంచుకున్నారు.