నార్వేలో వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే 23 మంది మృతి

Published: Saturday January 16, 2021

వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదని నార్వే హెచ్చరించింది. ఐరోపా దేశమైన నార్వేలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన కొద్దిసేపటికే 23 మంది మృతి చెందడం ఆ దేశ ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. జర్మనీకి చెందిన బయోన్‌టెక్, అమెరికాకు చెందిన ఫైజర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను, మోడెర్నా వ్యాక్సిన్‌ను నార్వే తొలి దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా అక్కడి ప్రజలకు ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే 23 మంది చనిపోయినట్లు నార్వే వైద్యఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. వారంతా వయసు పైబడిన వారని తెలిపారు. చనిపోయిన వారి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు. మరణించిన వారిలో 13 మంది పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చాయని, వారందరిలో కనిపించిన ఒకే రకమైన దుష్ప్రభావాలు వారి ఆరోగ్య స్థితిని బలహీనపరిచినట్లు తేలిందని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ వెల్లడించింది. నార్వేలో ఇప్పటివరకూ 33 మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిసింది.