‘మూడు’తో మూలనపడ్డ సెక్రటేరియట్‌

Published: Tuesday January 19, 2021

భోగి, సంక్రాంతి, కనుమ... à°† తర్వాత శనివారం, ఆదివారం! ఇలా అనేక వరుస సెలవుల తర్వాత సోమవారం సచివాలయం ‘తెరుచుకుంది!’ మరి... ఎంతగా కళకళలాడాలి? మంత్రులు, ఉన్నతాధికారులు, సందర్శకులతో ఎంతగా కిటకిటలాడాలి!? కానీ... అంతా ఉత్తదే! అధికారంలోకి రాగానే అమరావతిపై ‘మూడు’ మార్చుకున్న పాలకులు... సచివాలయంపై శీతకన్నేశారు. మంత్రివర్గ సమావేశం ఉంటే మినహా... ముఖ్యమంత్రి సచివాలయానికి రారు. ఆయన... క్యాంపు కార్యాలయం నుంచే  సమీక్షలు, పాలన సాగిస్తున్నారు. మంత్రులూ సీఎం బాటలోనే వ్యవహరిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులూ వారి బాటలోనే నడుస్తున్నారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు సచివాలయంలో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. 

ఏడాదిన్నర క్రితం అమరావతి సచివాలయం సందడి సందడిగా ఉండేది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం ఒకటో బ్లాకుకు ఉదయం పది గంటలకల్లా  వచ్చేవారు. రాత్రి పొద్దుపోయేదాకా ఉండి అనేక శాఖలపై సమీక్షలు నిర్వహించే వారు. ఆయనతోపాటు ఆయా శాఖల మంత్రులూ  పాల్గొనేవారు. à°† తర్వాత మంత్రులు కూడా తమ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలోనే సమీక్షలు నిర్వహించేవారు. మంత్రులు, ఉన్నతాధికారులు సచివాలయంలోనే అందుబాటులో ఉంటారన్న నమ్మకంతో రాష్ట్ర నలుమూలల నుంచి వారిని కలవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండేవారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉదయం నుంచి సాయంత్రం ఆలస్యమైనా సచివాలయంలోనే ఉండి పనులు చేసే వారు. దీంతో సంద ర్శకులు ఉదయం నుంచి సాయంత్రంలోపు ఏదో à°’à°• సమయంలో వారిని కలిసే అవకాశం ఉండేది. అధికారులు ఉండేవారు కాబట్టి కింది స్థాయి ఉద్యోగులు  కూడా ఎక్కువ సమయం సచివాలయంలోనే ఉండేవారు.

జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత కొద్దికాలం సందర్శకుల రాక కొనసాగింది. 2019 డిసెంబరులో అసెంబ్లీలో సీఎం జగన్‌  మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పరిమితమయ్యారు. మంత్రులు కూడా వారి వారి క్యాంపు కార్యాలయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వెలగపూడి సచివాలయంలో సొంత చాంబర్లు ఉన్నప్పటికీ... అనేక మంది అమాత్యులు విజయవాడలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. వివిధ శాఖల ఉన్నతాఽధికారులు ‘మేమేం తక్కువ తిన్నామా’ అంటూ సచివాలయానికి రాకుండా విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులను సచివాలయం నుంచి అక్కడికే పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు. ఉదాహరణకు... వ్యవసాయ అనుబంధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయానికి రావడం మానేశారు. సీనియర్‌ ఐఏఎ్‌సలు అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కరికాల వలవన్‌, ఏఆర్‌ అనురాధ, ప్రవీణ్‌ ప్రకాశ్‌, మధుసూదన్‌ రెడ్డి తదితరులు సొంతంగా క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసుకుని, అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు సచివాలయానికి వచ్చిపోతున్నారు. 

సచివాలయం అంటేనే అమాత్యులకు నిలయం! కానీ... సచివులు చుట్టపుచూపుగానే ఇక్కడికి వస్తున్నారు. కేబినెట్‌ భేటీకి ఒకరోజు ముందు, తర్వాత... అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే హడావుడి చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో సీఎం నిర్వహించే సమీక్షలకు హాజరై... అట్నుంచి అటే వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు కూడా సచివాలయానికి రాకుండా తమ క్యాంపు కార్యాలయానికే వారిని పిలిపించుకుంటున్నారు. డిసెంబరు 18à°¨ కేబినెట్‌ భేటీ తర్వాత.. ఇప్పటి వరకు అనేక మంది మంత్రులు మళ్లీ సచివాలయం మొఖం చూడలేదు. 

à°—à°¤ ప్రభుత్వ హయాంలో సచివాలయం నిత్యం సందడిగా ఉండేది. మూడొంతులమంది మంత్రులు, దాదాపు అన్నిశాఖల అధికారులు, సుమారు 2000 వేల మంది ఉద్యోగులు, వెయ్యి మంది వరకు సందర్శకులతో కళకళలాడేది. ఇప్పుడు సందర్శకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ‘సార్‌ ఈరోజు రారు. మంగళగిరిలో ఉన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు’ అనే సమాధానాలే వస్తున్నాయి.