గణతంత్ర దినోత్సవం రోజున హింస

Published: Friday January 29, 2021

గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరంమని భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ దేశానికి ఎంతో పవిత్రమైన గణతంత్ర దినోత్సవానికి జాతీయ జెండాకు అవమానం జరిగిందని అన్నారు. రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూనే అదే రాజ్యాంగంలోని విధుల్ని బాధ్యతల్ని గుర్తు చేశారు. హక్కులతో పాటు బాధ్యతల్ని కూడా సమ స్థాయిలో తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు.

 

ఇక ప్రభుత్వ పథకాల గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. పశువుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పశుధన్‌ పథకం ప్రతి ఏడాది 8.2 శాతం వృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. గ్రామీణులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామని అన్నారు. దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌లకు ఆమోదం తెలిపామని దీనితో దేశ ఆరోగ్య వ్యవస్థను తమ ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందని కొనియాడారు.

 

‘‘రైతుల ప్రయోజనాలకు 3 సాగు చట్టాలను తీసుకొచ్చాం. లాక్‌డౌన్‌ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో లేకుండా చూశాం. 80 కోట్ల మందికి 8 నెలల పాటు 5 కిలోల బియ్యం ఇచ్చాం. ఆత్మనిర్భర్‌ భారత్‌లో మహిళల పాత్ర కీలకంగా మార్చాం’’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.