డ్రైవర్ సీటులో నిమ్మగడ్డ.

Published: Wednesday February 03, 2021

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వాహనాలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈరోజు ఉదయం పౌరసరఫరాల శాఖ రేషన్ డెలివరీ వాహనాలను నిమ్మగడ్డ తనిఖీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీసుకు, రేషన్ డెలివరీ వాహనాలను  పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకువచ్చారు. పంపిణీ ఏ విధంగా జరుగుతుందో ఎస్‌ఈసీకి పౌరసరఫరాల‌శాఖ కమిషనర్ కోన శశిధర్ వివరించారు. అనంతరం ఎస్‌ఈసీ వాహనాలను పరిశీలించారు. అంతేకాదు ఆయన వాహనం ఎక్కి, డ్రైవర్ సీటులో కూర్చున్నారు. వాహనంపై ఉన్న జగన్‌ చిత్రాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో ఎస్‌ఈసీ వాహనాలను తనిఖీ చేశారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నవరత్నాలకు సంబంధించిన లోగోను వాహనంపై ప్రత్యేకంగా ముద్రించారు. 

 

 

రేషన్‌ డోర్‌ డెలివరీపై అంతిమ నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్‌ఈసీ)దేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికల ప్రక్రియలో ఎస్‌ఈసీయే రథసారథి అని స్పష్టం చేసింది. అమల్లో ఉన్న పథకాలతో పాటు ప్రభుత్వ ప్రతి చర్యనూ పర్యవేక్షించే అధికారం దానికి ఉందని తేల్చిచెప్పింది. వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ డోర్‌ డెలివరీ కార్యక్రమంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకోబోమని.. అధికారుల ద్వారా పంపిణీ చేస్తామని.. రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు ఎలా రాదో చెబుతూ పూర్తి వివరాలను రెండ్రోజుల్లో ఎస్‌ఈసీకి  సమర్పించేందుకు ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చింది.