నిమ్మగడ్డపై రోజా వ్యాఖ్యలు

Published: Friday February 05, 2021

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తరువాత కూడా ఏకగ్రీవాలను ఆపటం ఆయనపై ఆయనకు నమ్మకం లేదనిపిస్తోందని చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించకపోతే బాగుండదని రోజా పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని, ఫిర్యాదులు పరిష్కరించాకే ఫలితాలు ప్రకటించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఫిర్యాదులపై నివేదిక పంపాలని కలెక్టర్లను  ఎన్నికల కమిషన్‌ కోరింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ  హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు గుర్తించామన్నారు. జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలను ఎస్‌ఈసీ అభినందించారు. 

 

మరోవైపు అధికారాన్ని అడ్డంపెట్టుకుని పంచాయతీల్లో ఏకగ్రీవాల వేటను వైసీపీ ముమ్మరం చేసింది. కన్నేసిన ప్రతీ పంచాయతీని దారికి తెచ్చుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల సొంత పంచాయతీల మొదలు టీడీపీ గట్టిపోటీ ఇస్తున్న ప్రతీచోటా అసలు ఎన్నికలే జరగకుండా పావులు కదుపుతోంది. బరిలో నిల్చున్న అభ్యర్థులను నయానాభయానా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు పంపుతోంది. అభ్యర్థిత్వం ఉపసంహరణకు గురువారం చివరి రోజు కావడంతో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు  సభ్యులకు డబ్బు à°Žà°° వేస్తోంది. పోటీ నుంచి తప్పుకుంటే రూ.20లక్షల వరకు ఆఫర్లు ఇస్తోంది. కాదంటే పెన్షన్లు, సంక్షేమ పథకాల నగదు, ఇళ్ల పట్టాలు రద్దుచేయిస్తామంటూ అధికార పార్టీ నేతలు కొందరు బెదిరింపులను తీవ్రతరం చేశారు.