కరోనా ప్రభావంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్న ప్రజలు

Published: Monday May 03, 2021

కాలు బయట పెడితే కరోనా కాటేస్తుందేమోననే భయంతో చాలామంది ప్రయాణాలు మానుకుంటున్నారు. దీంతో విమానాలు, రైళ్లు, బస్సుల్లో రద్దీ బాగా తగ్గిపోయింది. ఆక్యుపెన్సీ పెద్దగా లేకపోవడంతో అనేక సర్వీసులు రద్దయిపోతున్నాయి. గత మార్చి నెలలో విశాఖపట్నానికి రోజుకు 24 విమానాలు వచ్చి వెళ్లేవి. అంటే 48 సర్వీసులు నడిచేవి. వాటిలో ఐదు వేల నుంచి ఆరు వేల మంది ప్రయాణించేవారు. ఏప్రిల్‌కు వచ్చేసరికి క్రమంగా వాటి సంఖ్య పడిపోయింది. ఏప్రిల్‌ 15న 20 విమానాలే వచ్చి వెళ్లాయి. వాటిలో ప్రయాణికుల సంఖ్య 3,723 దగ్గరే ఆగిపోయింది. ఏప్రిల్‌ 20న 14 విమానాలే వచ్చి వెళ్లాయి. వాటిలోనూ ప్రయాణికుల సంఖ్య మూడు వేలకే పరిమితమైంది.

25వ తేదీ నాటికి విమానాల సంఖ్య 18కి పెరిగి, 30 వ తేదీ నాటికి 16కి  పడిపోయింది. ప్రయాణికుల సంఖ్య 3 వేలు దాటలేదు. గతంలో హైదరాబాద్‌, బెంగళూరులకు ఎక్కువ సర్వీసులు నడిచేవి. ప్రతి రెండు గంటలకు ఒక విమానం ఉండేది. ఇప్పుడు ప్రయాణికులు తగ్గిపోవడంతో కొన్ని సర్వీసులు రద్దయిపోయాయి. విజయవాడ సర్వీసు నిలిచిపోయింది. తిరుపతి విమానమూ లేదు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ముంబై, రాయిపూర్‌, పోర్టుబ్లెయిర్‌, కర్నూలుకు మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి. ఒక్కోసారి చెన్నై, ముంబైల నుంచి విశాఖ వచ్చే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పది మంది కూడా దాటడం లేదు.

రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రయాణికులు లేని మార్గాల్లో రైళ్లను రద్దు చేయాలని ఆదేశించడంతో విశాఖపట్నం మీదుగా నడిచే ఐదు సర్వీసులను గత వారం రోజుల్లో రద్దు చేశారు. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లలో వెయ్యి నుంచి 1,500 మంది ఎక్కుతుంటారు. ఇప్పుడు కొన్ని రైళ్లలో ఇక్కడ ఎక్కేవారు 100 మంది కంటే తక్కువగా ఉంటున్నారు. దీంతో విశాఖపట్నం-రాయగడ, విశాఖపట్నం-పలాస, విశాఖపట్నం-గుణుపూర్‌, హౌరా-యశ్వంత్‌పూర్‌ సర్వీసులు రద్దు చేశారు. తాజాగా ఆదివారం నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్‌ దురంతో సర్వీసు కూడా రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ అధికారులు ప్రకటించారు. గతంలో కరోనాకు ముందు రోజుకు 35 వేల నుంచి 40 వేల మంది విశాఖ నుంచి ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య నాలుగు వేలు దాటడం గగనంగా మారింది. 

విశాఖపట్నం రీజియన్‌ ప్రజా రవాణా శాఖ/ఆర్టీసీ గతంలో 1,041 బస్సులు తిప్పేది. అప్పట్లో ఆక్యుపెన్సీ 70 శాతం ఉండేది. గత నెల రోజులుగా కరోనా తీవ్రత పెరగడంతో ప్రయాణికుల సం ఖ్య తగ్గింది. దాంతో అన్ని రూట్లలోను బస్సు  ల సర్వీసులు ఉపసంహరించారు. ప్రస్తుతం 520 బస్సులే నడుస్తున్నాయి. వాటిలో కూడా ఆక్యుపెన్సీ 38 శా తమే ఉండడంతో ఆదా యం తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.