సంగం డెయిరీ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఆపండి

Published: Tuesday May 04, 2021

సంగం డెయిరీ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని సీనియర్‌ న్యాయవాది బి. ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. డెయిరీని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే జీవో జారీ చేసినట్టు వివరించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేశారు. à°ˆ మేరకు జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు సోమవారం ఆదేశాలిచ్చారు. డెయిరీ నిర్వహణ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ 1978 జూలై 17à°¨ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ..పశుసంవర్థక, పాడిపరిశ్రమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన జీవో 19ని  సవాల్‌ చేస్తూ సంగం పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ వి.ధర్మారావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. à°ˆ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. 

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘‘సంగం డెయిరీని అధీనంలోకి తీసుకొనే అధికారం ప్రభుత్వానికి లేదు. సహకార సంఘంగా మారుస్తూ 1978లో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ 43 ఏళ్ల తరువాత ప్రభుత్వం ఇప్పుడు మరో జీవో ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పాలసీకి అనుగుణంగా 1997 గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల కోపరేటివ్‌ యునియన్‌ లిమిటెడ్‌(జీడీఎంపీసీయూఎల్‌)ను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల మ్యూచ్యువల్లీ ఎయిడెడ్‌ కోపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌(జీడీఎంపీఎంఏసీయూఎల్‌)à°—à°¾ మార్చారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న షేర్‌ క్యాపిటెల్‌తోపాటు బకాయిలను తిరిగి చెల్లించారు. 

 

రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఆస్తులు డెయిరీ à°•à°¿à°‚à°¦ లేవు. మ్యూచ్యువల్లీ ఎయిడెడ్‌ కోపరేటివ్‌ యూనియన్‌à°—à°¾ మార్చడంపై అభ్యంతరాలు ఉంటే ఏపీడీడీసీ ఆనాడే ట్రైబ్యునల్‌కు వెళ్లాల్సింది. à°† తరువాత జీడీఎంపీఎంఏసీయూఎల్‌ను ప్రొడ్యూసర్‌ కంపెనీ à°•à°¿à°‚à°¦ రిజిస్టర్‌ చేశారు. కంపెనీ చట్టం à°•à°¿à°‚à°¦ రిజిస్ట్రేషన్‌ చేసుకొని కార్పొరేట్‌ హోదా పొందిన తరువాత ప్రభుత్వానికి జోక్యంచేసుకొనే అధికారం లేదు. కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వాటాదారులు, డెరెక్టర్ల హక్కులను హరించడమే. ప్రజా ప్రయోజనం పేరుతో డెయిరీ ఆస్తులను, యాజమాన్యాన్ని అధీనంలోకి తీసుకొనే అధికారం ప్రభుత్వానికి లేదు. సంగం డెయిరీ ఆస్తుల స్వాధీనానికి అనుమతిస్తే.. రాబోయే రోజుల్లో వ్యక్తిగత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటారు. à°ˆ విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును నిలుపుదల చేయండి’’ అని కోరారు. 

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ‘‘కోపరేటివ్‌ యూనియన్‌ నుంచి మ్యుచ్యువల్‌ ఎయిడెడ్‌ కోపరేటివ్‌ యూనియన్‌à°—à°¾ మార్చడం.. à°† తరువాత ప్రొడ్యూసర్‌ కంపెనీగా రిజిస్టర్‌ చేయడం వరకు అంతా సందేహాస్పదమే. ప్రభుత్వం విధించిన షరతులకు కట్టుబడకపోవడంతోనే 1978లో ఇచ్చిన జీవోను ఉపసంహరించారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే జీవో జారీ చేశారు. జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. డెయిరీ విషయంలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నందునే ప్రభుత్వం జోక్యం చేసుకుంది’’ అని తెలిపారు. 

సంగం డెయిరీ వ్యవహరంలో  ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించేందుకు ఏసీబీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రశ్నించాలని స్పష్టంచేసింది. అదేవిధంగా డెయిరీ à°Žà°‚à°¡à±€ గోపాలకృష్ణన్‌ను రెండురోజులు, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంను à°’à°• రోజు ప్రశ్నించేందుకు వీలుకల్పించింది. సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో నమోదైనకేసులో వీరిని ఐదు రోజుల కస్టడీకి ఇస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. à°ˆ ఉత్తర్వులను 3రోజులు తాత్కాలికంగా నిలిపివేస్తూ à°ˆ నెల 1à°¨ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సోమవారం మరోసారి వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి...జైలులో ప్రశ్నించేందుకు అనుమతించారు.