ప్రాణం తీసిన గేమ్స్

Published: Tuesday May 04, 2021

 ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఓ ఇంటర్‌ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చాయి. పాడేరు నీలకంఠానగర్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్‌ఎంపీ వైద్యుడు శంకు శంకరరావు రెండో కుమారుడు జయకుమార్‌ (19) పెందుర్తి కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జయకుమార్‌ ఎక్కువగా పబ్జీ ఆడుతుండేవాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆరు నెలల క్రితం విశాఖపట్నంలో చికిత్స చేయించారు. ప్రస్తుతం మందులు వాడుతూ ఇంటి వద్ద వుంటున్న జయకుమార్‌ మళ్లీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ మరింత మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

 

ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం కుటుంబీకులు వెతకగా, మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలోని బావి వద్ద సెల్‌ఫోన్‌ లభించింది. దీంతో అనుమానం వచ్చి సోమవారం ఉదయం బావిలో గాలించగా జయకుమార్‌ మృతదేహం లభ్యమైంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ తమ కుమారుడి ప్రాణం తీశాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.