కరోనా చికిత్సకు లక్షల్లో బిల్లులు.. ఆస్పత్రికి వెళితే అప్పులపాలే

Published: Friday May 07, 2021

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నాం. బిల్లు రూ.5 లక్షలైంది! బెడ్‌లు అందుబాటులో లేవన్నారు! ‘డబ్బులు ఎంతైనా పర్లేదు సార్‌’... అన్న తర్వాత, నాలుగు లక్షలు అడ్వాన్స్‌ తీసుకుని బెడ్‌ ఇచ్చారు. మొత్తం బిల్లు 6 లక్షలైంది! ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే మాట! కుటుంబ సభ్యులకో, బంధువులకో, మిత్రులకో ఎదురవుతున్న అనుభవం! ‘హోం ఐసొలేషన్‌’తో నయమైతే అదృష్టం! పొరపాటున ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమొచ్చినా, అందులోనూ పెద్ద వయసు వారికి బెడ్‌ అవసరమైనా లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే. బైపాస్‌ సర్జరీకి రూ.5 లక్షలు మించి ఖర్చు కాదు. ఐదారు నెలలు నడిచే కొన్ని రకాల క్యాన్సర్‌ చికిత్సకు పది లక్షలు అవుతుందేమో! కానీ... ఆపరేషన్లు, రేడియేషన్లు, కీమోల అవసరమే లేని కరోనా చికిత్స కూడా లక్షలకు లక్షలు పలుకుతోంది! ఎందుకిలా... ఏం చేస్తున్నారు... అంటే వస్తున్న సమాధానం ఒక్కటే! ‘డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. బాధితుల భయాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు!’ కొవిడ్‌కు ఇప్పుడు అందిస్తున్న చికిత్స... మందు బిళ్లలు, అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌, రెమిడెసివర్‌ ఇంజక్షన్‌! ఇంకా పరిస్థితి తీవ్రమైతే అతి కొద్దిమందికి వెంటిలేటర్‌పెట్టి చికిత్స అందించాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో వెంటిలేటర్‌ బెడ్‌కు రోజుకు రూ.10 వేల దాకా చార్జి చేస్తారు. బెడ్‌ చార్జి ఆరేడు వందల నుంచి 3 వేల వరకు ఉంటుంది. రెమ్‌డెసివర్‌ ఒక్కో డోస్‌ రూ.3400. ఆరు డోసులు ఇచ్చినా... 20,400. వైద్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్‌, గ్లౌజులు, మాస్క్‌ అన్నీ కలిపినా రూ.500. మొత్తంగా చూస్తే... కొవిడ్‌కు à°Žà°‚à°¤ భారీ చికిత్స చేసినా... లక్ష నుంచి రూ.2 లక్షలకు మించదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ... రాష్ట్రవ్యాప్తంగా అనేక పట్టణాల్లో బెడ్‌ కావాలంటే రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు అడ్వాన్స్‌ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. à°† తర్వాత మొత్తం బిల్లు ఎక్కడి దాకా అయినా పోవచ్చు!

 

ఉచితంగా చికిత్స, నిర్దిష్టంగా ఫీజులు... అని ముఖ్యమంత్రి చెబతున్న మాటలు ఎక్కడా అమలు కావడంలేదు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లోనే ప్రైవేటు ఆస్పత్రుల దందా బయట పడింది. పద్ధతిగా నడిచే కొన్ని ఆస్పత్రులను మినహాయిస్తే... అత్యధిక ఆస్పత్రుల్లో ఫీజులను పిండేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో చికిత్సకు ఒక్కో ధర నిర్ణయించగా... ప్రైవేటు ఆస్పత్రులు తమ సొంత ధరలను అమలు చేస్తున్నాయి. బెడ్‌, ఆక్సిజన్‌, ఐసీయూ, రెమ్‌డెసివర్‌, వెంటిలేటర్‌... ఇలా ప్రతి సేవకూ ప్రత్యేక ధరలు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... అడ్వాన్స్‌/డిపాజిట్‌ వసూలు చేయరాదు. కానీ, చాలా వరకు ఆస్పత్రులు అడ్వాన్స్‌ కడితేనే అడ్మిషన్‌ అని తేల్చి చెబుతున్నాయి.

 

ఇక్కడ మాత్రమే... ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులు, కొన్ని ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌ ఆస్పత్రుల్లో మాత్రమే కొవిడ్‌కు ఉచిత చికిత్స అందిస్తున్నారు. ఇదికూడా అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్‌, ఇతర నోడల్‌ అధికారులు సిఫారసు చేసిన కేసుల్లోనే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీకి అంగీకరిస్తున్నారు. ఇవేవీ లేకుండా కరోనా ఆరోగ్యశ్రీ కార్డు, పాజిటివ్‌ రిపోర్టు చేతిలో పట్టుకొని వెళితే... ‘బెడ్‌లు ఖాళీ లేవు! ఖాళీ అయితే కబురు చేస్తాం’ అని చెబుతున్నారు. à°† మాట వినగానే బాధితుల గుండెలు జారిపోతున్నాయి. బెడ్‌ లేదంటే ఎలా? చికిత్స ఎలా... అంటూ ఫీజులు చెల్లించడానికి సిద్ధమయిపోతున్నారు. 2-3 లక్షల అడ్వాన్స్‌తో మొదలయ్యే ‘చికిత్స’ అలా అలా మరిన్ని లక్షలకు చేరుకుంటోంది. ఇక... రెమిడెసివర్‌ పేరిట దోపిడీకి అంతూపొంతూ ఉండటం లేదు.