మానసిక వికలాంగుల పాఠశాల కూల్చివేతపై నిరసనలు

Published: Monday June 07, 2021

 దివ్యాంగ విద్యార్థుల కోసం సేవాభావంతో,  ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఓ వ్యక్తి నిర్వహిస్తున్న పాఠశాలను మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) అధికారులు కూల్చివేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. స్కూల్‌ను మూసివేయించడంపై తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభం శుభం తెలియని మానసిక దివ్యాంగులైన చిన్నారులను అక్కున చేర్చుకుని, చదువుతో పాటు ఆటపాటలు నేర్పించే ఉద్దేశంతో విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన కండిపల్లి శ్రీనివాసరావు... 2006లో తన ఇంటిలోనే పాఠశాల ఏర్పాటు చేశారు. ఏటేటా పిల్లలు పెరుగుతుండటంతో అదే ప్రాంతంలో జీవీఎంసీ పాఠశాల వెనుక ఉన్న సుమారు 2వేల గజాల ఖాళీ స్థలంలో ‘హిడెన్‌ స్ర్పౌట్స్‌’ పేరుతో దివ్యాంగుల పాఠశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 2013లో అప్పటి జీవీఎంసీ కమిషనర్‌ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు.

సుమారు వందమంది వరకు దివ్యాంగ విద్యార్థులు ఉన్నారని తెలుసుకున్న కమిషనర్‌... ఆ స్థలాన్ని ఏడాది పాటు నెలకు రూ.3వేల అద్దె చొప్పున నామమాత్రపు లీజుకు ఇచ్చారు. శ్రీనివాసరావు ఆ స్థలంలో షెడ్లు నిర్మించి, దివ్యాంగ చిన్నారులకు విద్యా బోధనతో పాటు ఆటపాటలు, సంగీతం నేర్పించడం ప్రారంభించారు. నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చేర్పించడంతో కొద్దిరోజుల్లోనే విద్యార్థుల సంఖ్య 190కి చేరింది. దూరప్రాంతాల విద్యార్థుల రాకపోకల కోసం దాతలు 3 బస్సులు సమకూర్చారు. పాఠశాల నిర్వహణ తీరును చూసిన అప్పటి జీవీఎంసీ కమిషనర్‌... లీజు గడువును పొడిగిస్తున్నట్టు మౌఖికంగా చెప్పడమే కాకుండా, నెలవారీ అద్దెను కూడా రద్దు చేశారు. అప్పటి నుంచి పాఠశాల సాఫీగా నడుస్తోంది.