శరవేగంగా విశాఖ భూముల తాకట్టు

అప్పుల కోసం ‘విశాఖ’ను తనఖాలోకి నెట్టే కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. ‘అర్జంట్’... అంటూ కిందిస్థాయి సిబ్బందిని అధికారులు తరుముతున్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్, రెండు తహసీల్దార్ కార్యాలయాలతో సహా 15 శాఖల స్థలాలను ఏపీఎ్‌సడీసీ(రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్)కి కట్టబెట్టి... రూ.1600 కోట్లు అప్పు తెచ్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ గురువారం ‘తనఖాలో విశాఖ’ శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ఇది పరువు తక్కువ పనే అని ప్రజలు, సామాజిక వేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే... ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. భూముల తనఖాకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ‘అర్జంట్’గా ఈ వ్యవహారం పూర్తిచేయాలని కలెక్టర్ పేర్కొనడంతో రెవెన్యూ వర్గాలు సర్వే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ నెల ఒకటో తేదీన ఫైనాన్స్ విభాగం నుంచి తనఖాకు ఉపకరించే భూములను గుర్తించాలని ఉత్తర్వులు వచ్చాయి. నాలుగు రోజుల్లోనే ఆ కార్యక్రమం పూర్తిచేసి భవనాలు, భూములు, వాటి విస్తీర్ణం, విలువలు పేర్కొంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి ఆగమేఘాలపై గ్రీన్‌సిగ్నల్ రావడంతో, గుర్తించిన 15 ఆస్తులను వెంటనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎ్‌సడీసీ) పేరిట బదిలీ చేయాలని విశాఖపట్నం ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. తనఖా పెట్టాలని ప్రతిపాదించిన 213.56 ఎకరాల స్థిరాస్తుల్లో రెవెన్యూ, అటవీ, విద్య, పట్టు పరిశ్రమ, వ్యవసాయ, మార్కెటింగ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు చెందిన భూములు ఉన్నాయి. వాటిని తనఖా పెట్టబోతున్నట్టు ఆయా శాఖలు, సంస్థల అధిపతులకు ఇంతవరకు తెలియజేయలేదు. ప్రభుత్వం సర్వే చేయించాలని చెప్పిందంటూ కొలతలు వేసేస్తున్నారు. బుధవారం కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో సర్వే పూర్తి చేయగా, గురువారం గోపాలపట్నం రైతుబజారు స్థలంలో కొలతలు పూర్తి చేశారు.
ప్రభుత్వం తనఖాకు ప్రతిపాదించిన భవనాలు, భూముల్లో కలెక్టర్ కార్యాలయం నుంచి రైతుబజారు వరకు ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ అతిథిగృహం రెండూ బ్రిటీష్ కాలంలో నిర్మించినవి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగినవి. వాటిని హెరిటేజ్ భవనాలు(వారసత్వ సంపద)గా గుర్తించారు. వాటిని కూడా గౌరవించకుండా తనఖాలోకి నెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను 23.58 ఎకరాల్లో 1956లో ఏర్పాటు చేశారు. అక్కడికి సమీపంలోనే 17.33 ఎకరాల్లో ప్రభుత్వ ఐటీఐ ఉంది. పారిశ్రామిక రాజధానిగా పేరొందిన విశాఖపట్నంలోని అన్ని పరిశ్రమలకు ఈ రెండు విద్యా సంస్థల నుంచి సాంకేతిక విద్యను అభ్యసించిన వేలాది మంది యువత తయారీ రంగంలో సేవలు అందిస్తున్నారు. మధురవాడ సమీపానున్న బక్కన్నపాలెంలో దివ్యాంగుల కోసం శిక్షణ, తయారీ కేంద్రం 1983లో ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణతోపాటు ట్రైసైకిళ్లు వంటివి తయారుచేస్తారు. పశువులకు అవసరమైన గ్రాసాన్ని పెంచేందుకు ఆరిలోవలో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు వందల ఎకరాల భూములు ఉండేవి. వివిధ రకాల ప్రయోజనాల కోసమని 60 శాతానికి పైగా భూములు తీసేసుకున్నారు. ఇప్పుడు మరో 30 ఎకరాలు తనఖా పెట్టేయడానికి నిర్ణయించారు.
వారసత్వ సంపదగా వచ్చిన భవనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వందేళ్లు దాటినవన్నీ హెరిటేజ్ భవనాలే. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయాన్ని 1913లో ప్రారంభించారు. దానిని వారసత్వ సంపదగానే గుర్తించారు. అవి చేతులు మారినా... వాటి రూపు మార్చకూడదు. మరమ్మతులు కూడా ఇష్టానుసారం చేయకూడదు. అలాంటివి ప్రభుత్వ ఆధీనంలో ఉంచి పరిరక్షించాల్సిందే. తనఖా పెడితే ఆ తరువాత దాని ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. - జయశ్రీ హట్టంగడి, హెరిటేజ్ నేరేటర్

Share this on your social network: