అప్పు కోసమే విశాఖ తనఖా

Published: Sunday June 13, 2021

‘అప్పుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని తనఖా పెడుతుంది. రూ.1600 కోట్ల కోసం 15 ప్రభుత్వ శాఖలకు చెందిన 213 ఎకరాలను తాకట్టు పెడుతోంది. ఇప్పటికే ఏ 2 విజయసాయిరెడ్డి విశాఖను సర్వనాశనం చేశారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో నగరాన్ని తాకట్టు పెడుతోంది. సీఎంకి సంపద సృష్టించడం చేతకాక, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు’’ అని మాజీ మంత్రి సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులకు à°“ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌కు భూములన్నింటినీ కట్టబెట్టి తద్వారా అప్పు తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు, మేధావులు, నాయకులు ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ భూములు తనఖా పెడితే తప్పేముందని మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడడాన్ని తప్పుపట్టారు. మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అమ్మేశారని ఆరోపించారు. కాకినాడ సెజ్‌ నుంచి జీఎంఆర్‌ను తప్పించి విజయసాయిరెడ్డి అల్లుడుకు చెందిన అరబిందోకు ఇచ్చేశారన్నారు. విశాఖపట్నంలో బేపార్క్‌, సింహాచలం, మాన్సాస్‌ ట్రస్ట్‌, కార్తీకవనం భూములు ఆక్రమించుకున్నారన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతుంటే ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడకపోతే ఎలాగని ప్రశ్నించారు.