రాష్ట్రంలో 2,232 కేంద్రాల్లో వ్యాక్సినేషన్

ఆరోగ్యశాఖ ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ డే విజయవంతమైంది. ఆదివారం కనీసం 10 లక్షల మందికి టీకాలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13,60,931 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ క్రమంలో గతంలో ఒకరోజులో 6.40 లక్షల మందికి టీకాను అందించిన రికార్డును ఆరోగ్యశాఖ బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఇదే అత్యధిక రికార్డు. అందరికీ వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2,232 వ్యాక్సిన్ కేంద్రాల్లో లబ్ధిదారులకు టీకాలు వేశారు. ఈ క్రమంలో ఒక్క విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 75 వేలకు పైగా టీకాలు వేశారు.
ఉదయం నుంచే జనం వ్యాక్సిన్ కోసం క్యూ కట్టడంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 9,97,232 మంది టీకా తీసుకున్నారు. రాత్రి 7 గంటల తర్వాత కూడా కొనసాగిన టీకా కార్యక్రమంలో మొత్తం 13.60 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. పశ్చిమగోదావరిలో అత్యధికంగా 1,65,937 మందికి వ్యాక్సిన్ అందించగా.. తూర్పుగోదావరిలో 1,55,299, కృష్నాలో 1,40,583, విశాఖపట్నంలో 1,11,784, గుంటూరులో 1,06,698, ప్రకాశంలో 1,02,698, చిత్తూరులో 1,02,179, శ్రీకాకుళంలో 88,558, అనంతపురంలో 87,760, నెల్లూరులో 79,098, కర్నూలులో 79,007, కడపలో 78,014, విజయనగరంలో 63,314 మందికి టీకా వేశారు. ఆరోగ్యశాఖ ముందస్తుగా నిర్ణయించిన దాని ప్రకారం 45 ఏళ్లు దాటిన వారికి మొదటి, రెండో డోస్, 5 ఏళ్లలోపు చిన్నారుల తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ప్రయాణికులకు వ్యాక్సిన్ వేశారు. చాలాచోట్ల అధికారుల ఒత్తిడి కారణంగా వయస్సుతో నిమిత్తం లేకుండా వచ్చిన వారికి వచ్చినట్లు వ్యాక్సిన్ వేశారు. చివరికి 18 నుంచి 44 ఏళ్ల వయస్సు వారిని కూడా మెగా వ్యాక్సిన్ డేలో భాగస్వాములు చేశారు.

Share this on your social network: