కేసు సుప్రీం కెళితే..ఆ లెక్కే వేరు..

వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడకూర్చున్నా అందాల్సింది అందేతీరుతుంది. అంతేకాదు, ‘మన’ అనుకున్నవాళ్లను కూడా పక్కన కూర్చోబెట్టుకొని కావాల్సినంత మేలు చేయొచ్చు. కోర్టు కేసుల్లో ప్రభుత్వం ‘చెల్లింపుల’ వ్యవహారం సరిగ్గా ఇలాగే ఉంటోందని న్యాయవర్గాలు చెప్పుకొంటున్నాయి. చివరకు ఈ వ్యవహారం అస్మదీయ అడ్వకేట్ల జేబులు నింపేదిగా మారిందన్న అభిప్రాయమూ ఈ వర్గాల్లో బలపడుతోంది. ఆ చెల్లించేది కూడా చిన్నాచితక మొత్తం కాదు. దాదాపు ప్రతి కేసులో భారీగా, కొన్నికేసుల్లో అయితే అతి భారీగా కూడా ముట్టజెబుతున్నారని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన కేసులు, లేకుంటే ప్రభుత్వంపై ఇతరుల వేసిన కేసులు పరిశీలిస్తే...అన్నింటిలోను ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు ఎక్కువమంది ఉంటున్నారు. పైగా కౌంటర్ వేసిన వ్యక్తులు ఎంతమంది అడ్వకేట్లను సమకూర్చుకొంటే, అంతకు రెట్టింపు సంఖ్యలో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూసుకొంటోంది. గతంలో ఎన్నడూలేని కొత్త ట్రెండ్ ఇది. దీనికీ ఒకలెక్క ఉన్నదని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులకు కేవలం మేళ్లు చేకూర్చడం కోసమే ఎక్కువ మంది పేర్లను జాబితాలో చేరుస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు చేతికిస్తే గెలిపిస్తారా... గతంలో సత్తా చాటిన కేసులు వీళ్ల ఖాతాలో అసలు ఉన్నాయా అంటే ప్రభుత్వ న్యాయవర్గాలే చెప్పలేని పరిస్థితి! కానీ, ఒక్కో కేసులో ఐదు నుంచి 12 మందిపైనే పాల్గొంటున్నారు. వీరందరికీ ఫీజులు భారీగానే చెల్లిస్తున్నారు. రాజధాని అమరావతి కేసు విషయంలో సుమారు రూ.5కోట్లు న్యాయవాదులకు చెల్లించడం విమర్శలకు దారితీసింది.
రాష్ట్ర ప్రభుత్వంపై గత కొంతకాలంగా రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టులో భారీగా కేసులు నమోదవుతున్నాయి. పరిపాలన, విధానా నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను మేధావులు, వివిధ రంగాల నిపుణులు వ్యతిరేకిస్తూ దాఖలు చేస్తోన్నవే వీటిలో అధికం. తొలుత హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాగానే ఆ వెనువెంటనే సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తోంది. ఇలాంటి కేసులు ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగానే ఉన్నాయని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ చర్యలపై కేసులు దాఖలయినప్పుడు వాటిపై వాదించడానికి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ ) ఉంటారు. అలాగే అడ్వకేట్ ఆన్ రికార్డు (ఏఓఆర్) ఉంటారు. ఇంకా అదనపు అడ్వకేట్ జనరల్ ఉంటారు. కేసుల్లో ప్రభుత్వాన్ని గెలిపిస్తారనే ఇలాటివారిని ఏరికోరి తెచ్చిపెట్టుకుంటారు. అయినా, కొన్ని కేసుల్లో భారీగా ఖర్చుపెట్టి మరీ సీనియర్ న్యాయవాదులను పిలపించుకుంటారు. వీరి ఫీజులు లక్షల్లో ఉంటాయి. కొన్ని సీరియస్ కేసుల్లో ప్రభుత్వం చెల్లించే ఫీజుచూస్తే.. ఔరా! అనిపిస్తుంటాయి. మరి అదే సుప్రీం కోర్టు అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ, ఏఏజీ, ఇతర న్యాయవాదులకు లక్షల్లో చెల్లిస్తారు. కొన్ని కేసులకు సొలిసిటరల్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్‌ను కూడా పిలిపిస్తారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఏజీ, లేదా ఏఏజీ ఒకసారి అప్పియర్ అయితే సగటున ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయల ఫీజు, ఇతర అలవె న్సులు ఉంటాయి. ప్రైవేటుగా తీసుకొచ్చే సుప్రీం సీనియర్ న్యాయవాదులకు భారీగా ఫీజు చెల్లించాలి. సుప్రీం కేసులను అదనుగా తీసుకొని అస్మదీయ న్యాయవాదులు కొందరు పేరుతో ప్రభుత్వ సొమ్మును భారీగా పిండేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సుప్రీం కోర్టులో ప్రభుత్వ కేసు విచారణకొస్తే గెలిచామా అన్నదే సర్కారు తరఫున వాదనలు వినిపించే అడ్వకేట్‌లకు గీటురాయిగా ఉంటుంది. ఒకవేళ అనుకూలమైన తీర్పురాకుంటే డివిజన్ బెంచ్, పుల్‌బెంచ్‌కు వెళ్లయినా అనుకున్నది సాధిస్తారు. అయితే, ఏపీకి సంబంధించిన కేసుల్లో గెలుపుతో సంబంధం లేకుండా ఎంత ఎక్కువ మంది అడ్వకేట్లకు ఎంత భారీగా ఫీజులు ఇప్పించామన్నదే గీటురాయిగా మారిందా? ఫీజులు పిండుకోవడం కోసమే కొన్ని కేసులను సుప్రీందాకా తీసుకెళ్తున్నారా? అన్న అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కేసులను పరిశీలిస్తే లెక్కకు మించి అడ్వకేట్లను తీసుకొచ్చి భారీగా ఫీజులు చెల్లించినా ఫలితం మాత్రం ప్రభుత్వానికి చుక్కెదురు అన్నట్లుగానే ఉన్నాయి. రెగ్యులర్ కోర్టులు నడిచినప్పుడు ఎంత మంది అడ్వకేట్లు పాల్గొని వాదనలు వినిపించారు? కేసు ఫలితం ఏమిటన్నదానిపై స్పష్టత ఉంటుంది. ఇప్పుడు కరోనా కాలం. కేసుల విచారణ అంతా ఆన్‌లైన్‌లోనే. ఏపీకి కేసులు విచారణకొచ్చినప్పుడు వాదనలు వినిపించామా? లేదా? అన్నది అప్రధానంగా మారి, కేవలం ఆన్ లైన్‌లో లాగిన్ అయ్యామా? లేదా అన్నదే ముఖ్యంగా మారిందన్నట్లుగా న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది.
‘ఆయన’ పేరు ఉండాల్సిందే..
సుప్రీంకోర్టు కేసు విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరవుతారు. ఒక కేసుకు ఏజీకి లక్షన్నర ఫీజు చెల్లిస్తారు. అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) కూడా లాగిన్ అయితే ఆయనకూ మరో లక్షన్నర. ప్రస్తుతం ఏపీకి ఇద్దరు ఏఏజీలున్నారు. ఆ ఇద్దరూ లాగిన్ అయితే మూడు లక్షల ఫీజు చెల్లిస్తా రు. ఇక కొన్ని కేసులకు అడ్వకేట్ ఆన్ రికార్డు, సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్లు, రెగ్యులర్ అడ్వకేట్లను తీసుకొస్తే వారికి భారీగా ఫీజులు చెల్లిస్తారు. సుప్రీం కోర్టు లో విచారణ కొచ్చే ఏ కేసు కూడా ఒక్క రోజులోనో, లేదా ఒక్క సిట్టింగ్‌లోనో తేలదు. కనీసం 10-15 వాయిదాలు ఉంటాయి. ప్రతీ వాయిదాకు ఏజీ, లేదా ఏఏజీలు, వారు సిఫారసు చేసే సీనియర్ అడ్వకేట్లు లాగిన్ అయిపోతారు. సహజంగా ఒక కేసులో ఒక ఏజీ, ఏఏజీ లాగిన్ అయ్యారంటే సరిపోతుందని, కానీ రెండో ఏఏజీ కూడా లాగిన్ అయి సంఖ్యాపరంగా ఎక్కువ మంది కేసు విచారణలో పాల్గొన్నట్లుగా చూపించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కొన్ని సందర్భాల్లో అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరుకాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఏజీకి బదులు అదన పు ఏజీ, లేదా గవర్నమెంట్ ప్లీడర్‌ని పంపాలి. కానీ ఎవరెవరో జాబితాలో చేరిపోతున్నారు. అయితే, గత 6 నెలలుగా ఒక అదనపు అడ్వకేట్ జనరల్ అచ్చంగా సుప్రీం కోర్టు కేసుల్లోనే ప్రత్యేకంగా కనిపిస్తున్నారన్న న్యాయవాద వర్గాల్లో జరుగుతోంది.

Share this on your social network: