ప్రేక్షకుల్లేకుండానే విశ్వక్రీడలు..?:
అథ్లెటిక్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ లేకుండానే ఈసారి ఒలింపిక్స్ 100 మీటర్ల రేసు జరగబోతోంది. అత్యద్భుతంగా రాణిస్తున్న తరుణంలోనే (2017) అథ్లెటిక్స్‌కు గుడ్‌బై పలకడం ద్వారా బోల్ట్ తన అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ స్ర్పింట్ స్టార్ 2008 బీజింగ్ నుంచి 2016 రియో ఒలింపిక్స్ వరకు... వరుసగా మూడు ఒలింపిక్స్‌లో దుమ్ము దులిపేశాడు. ఇక ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో బోల్ట్ స్థానాన్ని భర్తీచేసే హీరో ఎవరా అని క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అయితే టోక్యోలో 100 మీటర్ల టైటిల్ కొట్టే మొనగాడెవరో బోల్ట్ చెప్పకనే చెప్పేశాడు. అమెరికాకు చెందిన ట్రేవాన్ బ్రోమెల్‌కు ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అతనిపై ఓ కన్నేసి ఉంచాలని బోల్ట్ అంటున్నాడు. ‘నాకిష్టమైన రేసులో నేను లేకుండా మరొకరిని విజేతగా చూడడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఈసారి బ్రోమెల్ ప్రదర్శనపై ఆసక్తిగా ఉన్నా. కొన్నేళ్లుగా తను అద్భుతంగా రాణిస్తున్నాడు. గాయాల కారణంగా కొంత వెనుకబడ్డాడుగానీ, లేదంటే అతను చాలా మంచి రన్నర్’ అని బోల్ట్ తెలిపాడు. గతవారం జరిగిన యూఎస్ ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రయల్స్‌లో బ్రోమెల్ 100మీ. టైటిల్ గెల్చుకున్నాడు. 2016 ఒలింపిక్స్ తర్వాత బ్రోమెల్ చాలాకాలం గాయాలతో బాధపడ్డాడు. కాగా 34 ఏళ్ల బోల్ట్ ఖాతాలో ఎనిమిది ఒలింపిక్ స్వర్ణాలు ఉండడం విశేషం. అంతేకాకుండా 100మీ.ల పరుగులో 9.58 సెకన్ల టైమింగ్‌తో ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు.
వచ్చే నెలలో జరిగే ఒలింపిక్స్‌కు గరిష్టంగా పది వేల మంది స్థానిక అభిమానులను అనుమతిస్తామని ఇటీవలే ఐఓసీ ప్రకటించింది. కానీ టోక్యోలో కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని అక్కడి మెట్రో పాలిటన్ గవర్నమెంట్ ప్రకటించింది. గతవారం 11 శాతం కేసులు పెరిగాయని, ఇందులో డెల్టా వేరియెంట్ బాధితులు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. దీంతో ప్రేక్షకులు లేకుండానే క్రీడలు నిర్వహించే ఆలోచన ఉందని టోక్యో ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు సీకో హషిమోటో తెలిపాడు.

Share this on your social network: