ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్ వాతావరణం

Published: Monday June 28, 2021

ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జాబ్ క్యాలెండర్ సెగలు రేపుతోంది. ప్రభుత్వం తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. గుంటూరులో సీపీఎం కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జాబ్ క్యాలెండర్‌కు నిరసనగా కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపిచ్చాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పలువురు విద్యార్థి నాయకులకు గృహనిర్బంధం చేశారు.

 

విశాఖలోని సీతమ్మధారలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నివాసం ముందు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన చేపట్టింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రి అవంతి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. పాదయాత్రలో నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.

 

అలాగే తిరుపతిలోని  జాబ్ లెస్ క్యాలెండర్ వద్దని.. జాబ్ ఉన్న క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వరకు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఒకానొక దశలో మంత్రి నివాసం ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.