కోవిడ్ సమయంలో డిజిటల్ ఇండియా సేవలు

కోవిడ్-19 మహమ్మారి సమయంలో లక్షలాది మందికి సేవలందించడానికి ‘డిజిటల్ ఇండియా’ పథకం దోహదపడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని అమలు చేయగలిగినట్లు తెలిపారు. ‘డిజిటల్ ఇండియా’ పథకం వార్షికోత్సవాల సందర్భంగా ఆయన గురువారం వివిధ రంగాలవారితో మాట్లాడారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానం వల్ల కోట్లాది మందికి సొమ్మును నేరుగా వారి ఖాతాలకే జమ చేయడం సాధ్యమైందని తెలిపారు.
యూపీఐ లావాదేవీలు బాగా పెరిగినట్లు తెలిపారు. ‘ఒక దేశం - ఒకే రేషన్ కార్డు’ పథకం ముఖ్యంగా వలస కార్మికులకు ఉపయోగపడుతోందని చెప్పారు. వ్యవసాయదారులు తమ పంటలను నేరుగా అమ్ముకోవడానికి డిజిటల్ ఇండియా వల్ల అవకాశం కలిగిందన్నారు. వారి ఖాతాలకే నేరుగా సొమ్మును జమ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం కలిగిందన్నారు. డిజిటల్ ఇండియా పథకం సామాన్యులను సాధికారులను చేసిందని తెలిపారు. ‘కనిష్ట స్థాయిలో ప్రభుత్వం, గరిష్ఠ స్థాయిలో పాలన’కు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు.
డిజిటల్ ఇండియాలో భాగంగా అనేక కొత్త పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ముఖ్యమైన దస్తావేజులను భద్రపరచుకోవడం కోసం డిజిలాకర్, కోవిడ్-19 ట్రేసింగ్ కోసం ఆరోగ్య సేతు యాప్ వంటివాటిని ప్రజల ముంగిటకు తెచ్చినట్లు తెలిపారు.
భారత దేశం అమలు చేస్తున్న డిజిటల్ సొల్యూషన్స్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నట్లు తెలిపారు. కొవిన్ వ్యాక్సినేషన్ ప్లాట్‌ఫామ్‌ను అనుకరించేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ విషయంలో ఐక్య రాజ్య సమితి ఐటీయూ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ర్యాంకింగ్స్‌లో భారత దేశానికి 10వ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. మన దేశంలో డేటా ప్రైవసీ సెక్యూరిటీ పెరిగిందన్నారు. విద్య నుంచి మందుల వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయన్నారు. వైద్య సేవలు చిట్ట చివరి వరకు బట్వాడా అవుతున్నాయన్నారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015 జూలై 1న ప్రారంభించారు.

Share this on your social network: