‘ఈడబ్ల్యూఎస్’ ఆలస్యం తెచ్చిన అనర్థం

రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై నిర్ణయంలో జరిగిన జాప్యం అగ్రవర్ణాల పేదలను వేల ఉద్యోగాలకు దూరంచేసింది. ప్రభుత్వం తాను భర్తీ చేశానని చెబుతున్నలెక్కల ప్రకారం చూసినా, ఈ రెండేళ్లలో దాదాపు 60వేలకు పైగా ఉద్యోగాలు వీరు కోల్పోయారు. ఇందులో ప్రభుత్వ కొలువులు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకొన్నా, ఇప్పటికే తమకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఈ కారణంగానే అగ్రవర్ణ పేద నిరుద్యోగులు వాపోతున్నారు. ఈడబ్ల్యూఎ్‌సపై అర్ధరాత్రి హడావుడిగా ఉత్తర్వులు వెలువడటంపై మరికొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. సవరించిన క్యాలెండరును విడుదల చేయాలంటూ పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎక్కువమంది సందేహిస్తున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన మొదట్లో 1.26 లక్షల గ్రామ సచివాలయ పోస్టులు భర్తీచేశారు. ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో అగ్రవర్ణ పేద విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని వేడుకున్నా, ప్రభుత్వం పట్టించుకోలేదు. పర్యావసానంగా పలు శాఖల్లో చేపట్టిన నియామకాల్లో సుమారు 18 వేల రెగ్యులర్ పోస్టులు కోల్పోయారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన లెక్కల ప్రకారం 19,701 కాంట్రాక్టు పోస్టులు, 3,99,791 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఈ రెండేళ్లలో నింపారు. అప్పుడే ఈడబ్ల్యూఎ్‌సపై నిర్ణయం తీసుకొంటే.. 10 శాతం అంటే సుమారు 42 వేల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టులను అగ్రవర్ణ పేద విద్యార్థులకు దక్కేవే. ఇలా.. మొత్తం 60 వేల పోస్టులు న్యాయంగా చెందాల్సి ఉండీ చేజారిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర ఆర్థిక వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలుచేయాలని నిర్ణయించింది. కేటాయించిన పదిశాతంలో కాపులకు 5 శాతం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం న్యాయ చిక్కుల్లో పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ అంశానికి పూర్తిగా స్వస్తి పలికింది. విద్యాసంస్థలకే ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లను పరిమితం చేసింది. ఈ కోటాను ఉద్యోగ కల్పనకు వర్తింపజేయడంలో ఎప్పటికప్పుడు జాప్యం చేస్తూవచ్చింది. వచ్చిన కొత్తలో కొద్దిమేర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి మరోసారి భర్తీ చేశారు. ఇకపై ఆ స్థాయిలోనూ పోస్టులు భర్తీ అయ్యేలా కనిపించడం లేదని అగ్రవర్ణ పేద వర్గాలకు చెందిన నిరుద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘జాబ్ క్యాలెండర్ తీరు వారి బెంగను మరింత పెంచుతోంది.

Share this on your social network: