జగన్ సర్కార్‌కు మరో అతిపెద్ద సమస్య

Published: Wednesday July 21, 2021

అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగన్ సర్కార్‌కు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. 2018-19 సంవత్సరంలో ఉపాధిహామీ పథకం పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తోంది. తమకు బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్‌లు హైకోర్టు కెక్కడంతో.. వారు పనుల్లో అవకతవకలు పాల్పడ్డారని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఇంకా ఎన్ని రోజులు విచారణ చేపడతారని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. 20 శాతం డబ్బు మినహాయించుకుని బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 5 లక్షలలోపు ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలుకాలేదు.

 

అయితే మాజీ సర్పంచ్‌లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో కేంద్రం నుంచి నిధులు రాలేదని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో సీరియస్ అయిన హైకోర్టు పాత బిల్లులు ఇవ్వకుండా 2019 సంవత్సరం బిల్లులు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. ఈ లోపు కేంద్రం నుంచి నిధులు విడుదల చేసినట్లు వచ్చిన లేఖను ప్రతివాదుల తరపున లాయర్‌లు హైకోర్టుకు అందించారు. బకాయిలు ఉన్న రూ. 2500 కోట్లు ఈ నెలాఖరు లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ చెల్లించలేని పక్షంలో వచ్చే వాయిదా నాటికి పంచాయతీరాజ్, ఆర్థిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌లు కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. 

 

హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నిధుల వేటలో పడింది. ఉద్యోగుల పెన్షన్లు, జీతాల కోసం రూ. 5,500 కోట్లు, సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ. 1500 కోట్లు, వడ్డీలకు రూ. 3500 కోట్లు.. అంటే  మొత్తం రూ. 10.500 కోట్లు ప్రతి నెల ప్రభుత్వానికి అవసరం. గత నెల ఈ నిధుల కోసం రెండు సార్లు సెక్యూరిటీ బాండ్‌ల వేలానికి ప్రభుత్వం వెళ్లగా.. అధిక వడ్డీతో తెచ్చిన రుణాన్ని మొదటిసారి రిజర్వు బ్యాంక్ ఓడీ కింద జమ చేసుకుంది. రెండోసారి రూ. 1750 కోట్లు ప్రభుత్వానికి రిజర్వుబ్యాంక్ జమచేసింది. ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఇచ్చిన రుణ పరిమితిలో కేవలం రూ. 150 కోట్లు మాత్రమే మిగిలాయి. దీంతో వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మిగిలి ఉన్న రుణ పరిమితిలోని రూ. 3500 కోట్లు ఇప్పుడే వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

చివరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం, రుణ పరిమితి అనుమతి కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కేంద్ర ఆర్థికశాఖాధికారులతో సమావేశమవుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న అధికారులు రాష్ట్ర విజ్ఞప్తిని ఎంతవరకు పట్టించుకుంటారనేది సందేహాస్పదంగా మారింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా రూ. 3500 కోట్లు రుణాలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బ్యాంకులు మాత్రం ఈ విషయంపై మౌనం వహిస్తున్నాయి. ఇవి కాకుండా కేంద్రం నుంచి నెలాఖరుకు రావాల్సిన జీఎస్టీ సర్ధుబాట్లు, ఆర్థికలోటు నిధులు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు విడుదలపై రాష్ట్ర అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నాటికి రూ. 13,000 కోట్లు అవసరం ఉండడంతో ఈ గండం గట్టెక్కేందుకు అధికారులు నానాతంటాలు పడుతున్నారు.