రెజ్లింగ్‌ ఫైనల్లో రవికుమార్‌

Published: Thursday August 05, 2021

భారత యువ రెజ్లర్‌ రవికుమార్‌ దహియా టోక్యోలో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. హరియాణాలోని ఓ మారుమూల పల్లెటూరులోని రైతు కుటుంబానికి చెందిన రవికుమార్‌.. అత్యున్నత వేదికపై పతకాన్ని ఖరారు చేసి మువ్వన్నెలు రెపరెపలాడించాడు. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన దహియా పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం రజతాన్ని ఖాయం చేసుకున్నాడు. సెమీఫైనల్లో కజకిస్థాన్‌ రెజ్లర్‌ నురిస్లామ్‌ సనయేవ్‌ను 9-7 తేడాతో ‘విక్టరీ  ఫాల్‌’ పద్దతిలో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రత్యర్థి తనపై ఆధిక్యంలో ఉన్నా.. ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని రవి పైచేయి సాధించడం విశేషం. స్వర్ణం కోసం గురువారం జరిగే ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ జవుర్‌ ఉగుయేవ్‌ (రష్యా)తో తలపడనున్నాడు. 

 

తడబాటుతో మొదలై..: మ్యాచ్‌ ఆరంభంలోనే రవి తడబాటుకు గురయ్యాడు. ఈ దశలో నురిస్లామ్‌ 1-0తో ముందుకెళ్లగా.. కోలుకున్న రవి ప్రత్యర్థిని పడగొట్టి వరుసగా రెండుపాయింట్లు సాధించాడు. దీంతో 2-1తో తొలి పీరియడ్‌ను ముగించిన రవి.. రెండో పీరియడ్‌లో వెనకబడ్డాడు. అనూహ్యంగా పుంజుకున్న నురిస్లామ్‌.. రవి రెండుకాళ్లను ఒడిసిపట్టి పాయింట్లు రాబట్టాడు. అంతే.. ఒక్కసారిగా 9-2తో స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ, ఏమాత్రం పట్టు వదలని రవి ఒక్కసారిగా దూకుడు పెంచి 7-9తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఈ క్రమంలో నురిస్లామ్‌ గాయపడడంతో అతని పట్టు కొంచెం తప్పింది. దీన్ని సద్వినియోగం చేసుకొన్న రవి.. ఆఖర్లో అతడిని ముఫ్పై సెకన్లపాటు లేవకుండా అదిమిపట్టుకున్నాడు. దీంతో రిఫరీ విక్టరీ బై ఫాల్‌ పద్దతిలో రవిని విజేతగా ప్రకటించాడు. అంతకుముందు తొలిరౌండ్లో 13-2తో ట్రిగ్గెరెస్‌ ఉర్బానో (కొలంబియా)పై గెలిచిన రవి.. క్వార్టర్స్‌లో 14-4తో జియోర్జి వాంగెలోవ్‌ (బల్గేరియా)ను చిత్తుచేసి సెమీస్‌ చేరాడు. 

సెమీస్‌ పోరులో 7-9తో వెనుకంజలో ఉన్నా రవికుమార్‌ విజేతగా నిలిచాడంటే అందుకు కారణం విక్టరీ బై ఫాల్‌. ఏమిటీ బై ఫాల్‌ అంటే.. ప్రత్యర్థి భుజాలు మ్యాట్‌పై ఉండేలా అతన్ని లేవనీయకుండా అదిమిపట్టుకోవడం. ఇలా కొద్దిసేపు అతన్ని అడ్డుకోగలిగితే.. పాయింట్లతో సంబంధం లేకుండా అతడిని విజేతగా ప్రకటిస్తారు.