మొదట్లో హడావుడి ...కానీ బిల్లులు రాక పనులు ఎక్కడివక్కడే

Published: Tuesday August 10, 2021

కొన్న తర్వాత ఎక్కువకాలం వాడితే బండి బోరుకు వస్తుంది. ఆ తర్వాత ఆ బండి షెడ్డుకు చేరాల్సిందే. కానీ, సర్కారువారి బోర్ల పథకం మాత్రం, సాంతం ప్రారంభించి... రైతులకు ఒకమేరకైనా లబ్ధి చేరకముందే షెడ్డుకు చేరుకుంది. ‘బోర్లు వేస్తేనే రైతుల పొలాల్లో సిరులు’ అని వైఎస్సార్‌ జలకళ పథకం ప్రారంభిస్తూ.. సీఎంతోపాటు అధికారులంతా ఆర్భాటాలుచేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గానికో బోరు మిషన్‌ను ప్రభుత్వమే కొంటుందని ఊదరగొట్టారు. బడ్జెట్‌లో వరుసగా రెండేళ్లు ఈ పథకానికి నిధులను చూపించారు. అధికారులు టెండర్లు  పిలుస్తూ హడావుడి చేశారు. నియోజకవర్గానికో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. బోరు తవ్వడం దగ్గరనుంచి నీళ్లుపడిన చోట మోటార్లు  బిగించేవరకు పనులన్నీ వారికే అప్పగించారు. అయితే, వారికి సరిగ్గా బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పథకం కథ మొత్తంగానే తిరగబడింది. పాత నిర్ణయం వద్దు అని చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన ‘జలసిరి’ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఉచితమంటూ రెండేళ్లుగా తమను ఎండబెడుతోందని పేద రైతులు మండిపడుతున్నారు. ఏడాదికోసారి వైఎస్‌ఆర్‌ జలకళ ప్రారంభోత్సవమంటూ హడావుడి చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. గత రెండున్నరేళ్లలో ఆన్‌లైన్‌ ద్వారా 1.88 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటివరకు 1.26 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. అయితే, కేవలం 8,434 మంది రైతుల పొలాల్లోనే బోర్లు పడ్డాయి. ఇందులో 7,252 వరకు సక్సెస్‌ బోరుబావులు ఉన్నాయి. కరెంటు కనెక్షన్‌ ఇచ్చి సోలార్‌ మోటారు బిగిస్తే నేల అడుగునుంచి నీళ్లు ఉబికివస్తాయి. కానీ, బిల్లులు క్లియర్‌ రాలేదని కాంట్రాక్టర్లు ఈ పనులు ఆపేశారు. వీరికి రూ.76.19 కోట్ల విలువైన బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి. ఇందులో కొంత మాత్రమే ఇచ్చి.. దాదాపు రూ.58 కోట్లు ఆపింది. ఎంతకీ బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో పథకం మూలనపడింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణాల పేద రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పథకం ఎన్టీఆర్‌ జలసిరి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇందిరజలప్రభ పేరుతో ఒక పథకం ప్రారంభమైనా... అప్పట్లో నాబార్డు నిధులివ్వకపోవడంతో కొనసాగలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ఉన్నతస్థాయిలో కసరత్తు చేసి పకడ్బందీగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పేద రైతులందరికీ ఈ పథకం ఉపయోగపడేలా అప్పటి సీఎస్‌ ఎస్పీ టక్కర్‌, ఆ తర్వాత వచ్చిన  దినేశ్‌కుమార్‌...సుమారు 10 మంది నిపుణులతో కమిటీలు వేసి సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించారు. దరఖాస్తు ప్రక్రియ నుంచి సర్టిఫికేట్ల సమర్పణ వరకు అన్నీ సరళతరం చేసి శాచురేషన్‌ విధానంలో భూమి ఉన్న ప్రతీ పేద రైతుకూ బోరు వేసేలా ప్రణాళికలు రూపొందించారు.  రెండేళ్ల పాటు ఈ పథకం ప్రయోగ దశలో నడిచింది. రైతులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జలసిరి పథకం కింద రూ.6 వేలు చెల్లిస్తే ఐదెకరాలలోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 200 అడుగుల బోరుబావితోపాటు రూ.2.42 లక్షలు విలువ చేసే  5 హార్స్‌పవర్‌ సోలార్‌పంపు సెట్లను అమర్చారు. అగ్రవర్ణాల రైతులయితే.. రూ.25 వేలు చెల్లిస్తే ఈ సౌకర్యాలన్నీ అందేవి. 2018-19కు సంబంధించి 45,300 బోర్లను తవ్వి వాటికి సోలార్‌ పంపుసెట్లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకొని 12,305 బోరుబావులను సిద్ధం చేశారు. మరో 8,939 బోరుబావులను సోలార్‌ పంపుసెట్లతో శక్త్తివంతంచేశారు. ఇలా 17,878 రైతులు లబ్ధిపొందగా, 44,695 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇందుకు ప్రభుత్వం రూ.51.26 కోట్లు ఖర్చుచేసింది. పథకం ఊపందుకుంటున్న సమయంలోనే కొత్త ప్రభుత్వం వచ్చి.. జలసిరి సహా అన్ని పథకాలనూ రద్దు చేసింది. 

 

అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు జలసిరి స్థానంలో కొత్త పథకం తీసుకురావాలన్న ఆలోచనే చేయలేదు. ఆ తర్వాత వైఎస్సార్‌ జలకళ పథకం తెచ్చి.. కేవలం బోర్లు ఉచితంగా వేస్తామని ప్రకటించింది. రెండేళ్ల పాటు వరుసగా రూ.200 కోట్లు, రూ.100 కోట్లు దీనికోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బోర్లను ఉచితంగా తవ్వాలని, తవ్వకపు ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధినుంచి రూ.300 కోట్లు అవసరమవుతాయని లెక్కించారు. అయితే, బోర్లు తవ్వడం సరే... వాటికి మోటార్‌, విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకపోతే పేద రైతుల పరిస్థితి ఏమిటని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో.. బోర్లుతో పాటు మోటార్‌, విద్యుత్‌ కనెక్షన్‌, ఇతర వైరు తదితర వస్తువులు పేద రైతులందరికీ ఉచితంగా ఇస్తామని ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది జూలై 3 నుంచి వైఎ్‌సఆర్‌ రైతు భరోసా ప్రారంభిస్తామంటూ జీవో నెం.641ను ప్రభుత్వం విడుదల చేసింది. దరఖాస్తులను గ్రామ సచివాలయాల ద్వారా అప్‌లోడ్‌ చేసుకోవాలని మార్గదర్శకాలను రూపొందించింది. ఏయే అధికారి వీటి మంజూరులో ఏయేచర్యలు తీసుకోవాలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌ 9న ఆ ఉత్తర్వులు సవరిస్తూ జీవో నెం.676 విడుదల చేశారు. దానికి మరికొన్ని సవరణలు చేస్తూ గత ఏడాది డిసెంబర్‌ 14న జీవో నెం. 689 తెచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 16న  గ్రామీణాభివృద్ధిశాఖ తాపీగా కార్యాచరణ మార్గదర్శకాలంటూ సర్క్యులర్‌ నెం.22ను విడుదల చేసింది. ఇన్ని జీవోలు, సర్క్యులర్లు జారీచేసినా కొత్తగా  సాధించిందేమీ లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసి పక్కాగా మార్గదర్శకాలు రూపొందించిందని, గత ప్రభుత్వం చేపట్టిందన్న ఒకే ఒక మిషతో కొత్తగా మార్గదర్శకాల పేరిట కాలయాపన చేస్తున్నదని పెదవి విరుస్తున్నారు.