శిశువులను భారంగా భావించే తల్లులకు అధికారుల వినతి

కారణమేదైనా కావొచ్చు.. పుట్టిన నెత్తుటి గుడ్డును వదిలించుకునేందుకు కొందరు తల్లులు, రోడ్ల పక్కన చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. అయితే ఆ పని చేయొద్దని.. శిశువులను వద్దనుకుంటే తమ కార్యాలయం దగ్గర ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఊయల్లో వేయాలని సంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు! ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రం మహిళా ప్రాంగణం ఆవరణలోని శిశుగృహం వద్ద గురువారం ప్రత్యేకంగా ఓ ఊయలను ఏర్పాటు చేశారు శిశువులను అక్కడ వదిలిపెడితే తెలిసిపోతుందేమన్న ఆందోళన అక్కర్లేదని, ఊయ ల ఏర్పాటు చేసిన చోట ఎలాంటి సీసీ కెమెరాలూ ఉండవని చెప్పారు. పసిబిడ్డలను కొందరు చెత్తకుప్పల్లో, మురుగు కాల్వల వద్ద పడేయడం వల్ల గాయలవుతున్నాయి. వారిని గుర్తించి, ఆస్పత్రుల్లో చేర్పించినా అప్పటికే ఆలస్యమే చనిపోతున్నారు. ఇలాంటి పసిబిడ్డలను సంరక్షించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చి, మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలిచ్చింది.
ఆ శాఖ జిల్లా అధికారి పద్మావతి, బాలిక సంరక్షణ అధికారి రత్నం, సేవ్ ద గర్ల్ చైల్డ్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ చక్రపాణి, డాక్టర్ శంకర్‌బాబు, ప్రిన్సిపాల్ కళింగ కృష్ణకుమార్, జైలర్ శివకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, మైత్రీ ఫౌండేషన్ నిర్వాహకుడు ఉదయ్‌కుమార్ సహకారంతో ఈ ఊయలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు శిశువులకు ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ ప్రతినిధులు నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఇలాంటి ఊయలలను త్వరలో జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేస్తామని బాలికా సంరక్షణ అధికారి రత్నం తెలిపారు.

Share this on your social network: