అమెరికాపై పుతిన్ విమర్శలు

Published: Sunday August 22, 2021

అమెరికా, ‘నాటో’ మిత్రదేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ శరణార్థులను మధ్య ఆసియా దేశాలకు తరలిస్తుండడంపై పుతిన్ మాట్లాడుతూ.. వారి వల్ల రష్యాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ఆసియాలో ఆఫ్ఘన్ వలసదారులకు వీసా రహిత ఆశ్రయం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని తాను రేపటి (సోమవారం) కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్‌టీవో) సమ్మిట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. నిన్న కజక్‌స్థాన్ అధ్యక్షుడు కసీం-జోమర్ట్ టోకయెవ్‌తో వర్చవల్ సమావేశంలో మాట్లాడిన పుతిన్ ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. 

 

అమెరికా, యూరప్ దేశాలు ఆఫ్ఘన్ పౌరుల వీసాలను ప్రాసెస్ చేస్తుంటే, పాశ్చాత్య దేశాలు కొన్ని ఆఫ్ఘన్ శరణార్థులను పొరుగున ఉన్న మధ్య ఆసియా దేశాలకు తరలిస్తున్నాయని పుతిన్ మండిపడ్డారు. శరణార్థుల ముసుగులో ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదులను తాము కోరుకోవడం లేదని పుతిన్ పేర్కొన్నారు. అయితే, ఆఫ్ఘన్ శరణార్థుల అంశానికి రష్యా విదేశాంగ శాఖ తొలి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. 

 

మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్ వంటివి ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి శరణార్థుల ప్రవాహం కొనసాగుతుందని ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శరణార్థుల ముసుగులో ఐసిస్ ఉగ్రవాదులు, మత తీవ్రవాదులు, ఛాందసవాదులు దేశంలోకి చొరబడతారని భయపడుతున్నాయి.