మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాట నిలబెట్టుకున్నారు. ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్టులలో ఒకరైన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియకు చెప్పినట్టే తన చిత్రం ‘లైగర్’లో పాట పాడే అవకాశం ఆమెకు కల్పించారు. షణ్ముఖ ప్రియ ఎంతగానో అభిమానించే అభిమాన నటుడు విజయ్ దేవరకొండ. అలాంటి విజయ్, షణ్ముఖ ప్రియ ఇండియన్ ఐడల్ షోలో ఉండగానే తన తదుపరి చిత్రంలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు పూరిజగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘లైగర్’లో షణ్ముఖ ప్రియతో ఒక పాట పాడించడం ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు విజయ్. అంతేకాకుండా షణ్ముఖ ప్రియ మరియు ఆమె తల్లిని తన నివాసంలో కలిసిని విజయ్.. షణ్ముఖ ప్రియను సత్కరించారు. అలాగే ఆమెకు కొన్ని బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘‘మేము నీ పాటను సినిమాలో ఉంచుతాము. అది ఒక చక్కని పాట. దానిని వినడానికి ఎదురు చూస్తున్నాను. వచ్చే వారం వింటానని అనుకుంటున్నాను. తొందరగా ఫైనల్ మిక్సింగ్‌కి పంపమని వారిని అడుగుతాను ”అని విజయ్ దేవరకొండ షణ్ముఖ ప్రియకు చెప్పారు. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మోహతా నిర్మిస్తున్నారు.

Share this on your social network: